Tollywood: ద్వితీయార్ధం..దుమ్మురేపేద్దాం

అగ్ర తారల సినిమాలు విడుదలైతేనే బాక్సాఫీస్‌ దగ్గర అసలు సిసలు సందడి. సంబరాలు... వసూళ్లు.. రికార్డులు అంటూ అభిమానులు ఉత్సాహంగా మాట్లాడుకునేది అప్పుడే. ఆ హంగామా చిత్రసీమలో ఎప్పటికప్పుడు సరికొత్త హుషారుని నింపుతూ ఉంటుంది.

Updated : 14 Apr 2024 13:10 IST

పోటెత్తనున్న అగ్రతారల చిత్రాలు

అగ్ర తారల సినిమాలు విడుదలైతేనే బాక్సాఫీస్‌ దగ్గర అసలు సిసలు సందడి. సంబరాలు... వసూళ్లు.. రికార్డులు అంటూ అభిమానులు ఉత్సాహంగా మాట్లాడుకునేది అప్పుడే. ఆ హంగామా చిత్రసీమలో ఎప్పటికప్పుడు సరికొత్త హుషారుని నింపుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది సంక్రాంతి తర్వాత అగ్ర తారల సినిమాల జాడే లేదు. రెండు మూడేళ్లుగా వేసవి సీజన్‌ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు తెలుగు చిత్రసీమ. ఈసారి కూడా అదే పరిస్థితే. అయితే ప్రథమార్ధంలో లోటుని భర్తీ చేసేలా ద్వితీయార్ధం అగ్ర తారల సినిమాలు బాక్సాఫీసు ముందుకు పోటెత్తనున్నాయి. వెల వెలబోతున్న థియేటర్లు ఇక నుంచి నెల నెలా రానున్న అగ్ర తారల సినిమాలతో కళ కళలాడనున్నాయి.

తెలుగు సినిమాకి అతి పెద్ద సీజన్‌ అంటే వేసవే. మార్చి నెల నుంచే వేసవి సినిమాలు థియేటర్ల ముందుకు వరస కడుతుంటాయి. విద్యార్థులు ఒక పక్క పరీక్షలు రాస్తుంటే...మరోపక్క కొత్త సినిమాలు ఊరిస్తుంటాయి. మూడు నెలలపాటు సాగే ఈ సీజన్‌ కోసం చిత్రసీమ ప్రత్యేకంగా సన్నద్ధమవుతూ ఉంటుంది. అయితే పాన్‌ ఇండియా సినిమాల నిర్మాణం పెరగడం... వాటి చిత్రీకరణల్లో జాప్యం చోటు చేసుకోవడం, విడుదల ప్రణాళికలు మారిపోవడం లాంటి కారణాలతో ఈమధ్య వేసవి సీజన్‌లో ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. ఈసారి కూడా సగం వేసవి పూర్తయ్యాక బాక్సాఫీస్‌ ముందుకు దూసుకొస్తున్నాయి అగ్ర తారల సినిమాలు. ఏడాది చివరి వరకూ ప్రతి నెలా ఓ పెద్ద సినిమా విడుదల కానుంది. మరోవైపు అనువాద చిత్రాలూ
అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

‘కల్కి’తో మొదలు...

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల నుంచి అగ్ర తారల సినిమాల జోరు కొనసాగనుంది. నిజానికి ఈ చిత్రం మే 9నే విడుదల కావల్సి ఉండగా ఎన్నికల దృష్ట్యా వాయిదా పడుతోంది. కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది ఈ నెల 17న ప్రకటించనుంది చిత్రబృందం. మే నెలాఖరులో కానీ, జూన్‌లో కానీ ఈ సినిమా విడుదల ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల తేదీని బట్టి జూన్‌, జులైలో వచ్చే సినిమాలపై ఓ స్పష్టత రానుంది. విక్రమ్‌ ‘తంగలాన్‌’తోపాటు దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ తదితర సినిమాలు రానున్నాయి.

ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ..

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప2’ ఆగస్టు 15న రాక ఖాయమైనట్టే. ఇటీవలే టీజర్‌ని విడుదల చేశారు. ఆగస్టులోనే నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ తెలుగులో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సెప్టెంబరులో పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ విడుదల ఖరారైంది. మరోవైపు తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన ‘గోట్‌’ కూడా ఇదే నెలలోనే రానుంది. అక్టోబరులోనేమో ఎన్టీఆర్‌ ‘దేవర’, రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ చిత్రాలొస్తున్నాయి. తను నటిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ను సెప్టెంబరు లేదా అక్టోబరులో విడుదల చేయనున్నట్లు రామచరణ్‌ తెలిపారు. బాలకృష్ణ - బాబీ కలయికలో వస్తున్న చిత్రంతోపాటు సూర్య ‘కంగువ’ విడుదలపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి పాన్‌ ఇండియా స్థాయిలో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాలన్నీ పొరుగు భాషల్లో విడుదలల్నీ దృష్టిలో ఉంచుకుని, ఆ తర్వాతే తేదీల్ని ప్రకటించాల్సి వస్తోంది. మే తర్వాత నుంచి బాక్సాఫీస్‌ దగ్గర పోటీ భారీగా ఉండనుంది. అందుకే ఇప్పుడు దొరుకుతున్న ఖాళీలోనే పరిమిత వ్యయంతో రూపొందిన పలు సినిమాలొస్తున్నామి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని