SSMB29: మహేశ్‌-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!

రాజమౌళి-మహేశ్‌ సినిమాపై ఎస్‌ఎస్‌ కార్తికేయ కామెంట్ చేశారు.

Published : 21 Mar 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం #SSMB29గా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచానాలున్నాయి. తాజాగా రాజమౌళి కుమారుడు కార్తికేయ దీనిపై చేసిన కామెంట్‌ వాటిని రెట్టింపు చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) స్పెషల్‌ స్క్రీనింగ్‌ కోసం రాజమౌళి కుటుంబసమేతంగా జపాన్‌ వెళ్లగా.. వారు బస చేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని తెలుపుతూ కార్తికేయ పోస్ట్‌ పెట్టారు. దీనికి ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘మహేశ్‌తో రాజమౌళి తీయనున్న సినిమా ట్రైలర్‌ ప్రభావం జపాన్‌లో ఎలా ఉంటుందో రిహార్సిల్స్‌ చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. దీనికి కార్తికేయ రిప్లై ఇస్తూ.. ‘ఆ సినిమా ప్రభావం జపాన్‌లో మాత్రమే ఉండదు.. ప్రపంచమంతా ఉంటుంది’ అన్నారు. దీనిపై సినీప్రియులు స్పందిస్తున్నారు. ‘త్వరగా అప్‌డేట్ ఇవ్వండి’, ‘ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేయండి’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే విజయేంద్రప్రసాద్‌ కథ, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి రాజమౌళికి (SS rajamouli) అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులను చిత్ర బృందం వేగవంతం చేసింది. మరోవైపు మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటనలు రాకపోవడంతో ఎన్నో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శకధీరుడు ఈ చిత్రంతో సృష్టించనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటీనటులు నటించే అవకాశం కనిపిస్తోంది.

థ్యాంక్యూ జపాన్‌..

జపాన్‌ వెళ్లిన రాజమౌళి కుటుంబం అక్కడి అభిమానులు చూపిన ప్రేమకు ఆశ్చర్యపోయింది. వాళ్లకు థ్యాంక్స్‌ చెబుతూ రాజమౌళి, కార్తికేయ ఇద్దరూ పోస్ట్‌లు పెట్టారు. ‘ప్రేమ చూపడంలో మీరు ఎప్పుడూ విఫలం కారు. మీ అభిమానం అసమానమైనది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని ఇక్కడికి పదేపదే వచ్చేలా చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు