Rajamouli: జపాన్‌లో భూకంపం.. భయాందోళనలకు గురయ్యానంటూ రాజమౌళి తనయుడి ట్వీట్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం జపాన్‌కు వెళ్లారు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ. తాజాగా వారు ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది.

Published : 21 Mar 2024 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) స్పెషల్‌ స్క్రీనింగ్‌లో భాగంగా చిత్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli), ఆయన తనయుడు కార్తికేయ, నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. వారు బసచేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనల వల్ల తాను భయాందోళనలకు గురయ్యానని కార్తికేయ ట్వీట్‌ చేశారు.

భూకంపం అలర్ట్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేసిన ఆయన.. ‘‘జపాన్‌లో ఇప్పుడే భూకంపం వచ్చింది. నేను 28వ ఫ్లోర్‌లో ఉన్నా. భూమి కంపించడం చూసి కొద్ది క్షణాల్లో భూకంపమని అర్థమైంది. నేను చాలా భయపడ్డా. కానీ, నా చుట్టూ ఉన్న జపాన్‌వాసులు ఎలాంటి కంగారు లేకుండా.. ఏదో వర్షం పడుతున్నట్లు ఏమాత్రం చలించలేదు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. ‘‘స్క్రీనింగ్‌ అయిపోయింది కదా. ఇండియా వచ్చేయండి’’, ‘‘అక్కడ అంతా బాగానే ఉందా’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. 5.3 తీవ్రతతో ఈరోజు ఉదయం జపాన్‌లో భూకంపం వచ్చింది.

రామ్‌చరణ్‌ (Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR). దీనిని దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. మార్చి 18న జపాన్‌లో ఈ సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేశారు. ఈ స్క్రీనింగ్‌లో రాజమౌళి పాల్గొన్నారు. అక్కడి వారు తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘జపాన్‌వాసులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అక్కడి ప్రజలు తమకు ఇష్టమైనవారికి ‘ఆర్గామి క్రేన్స్‌’ను బహూకరించడం సంప్రదాయం. ఈ చిత్రాన్ని వీక్షించిన 83 ఏళ్ల వృద్ధురాలు నాకు దానిని ఆప్యాయంగా ఇచ్చారు. అందుకోసం థియేటర్‌ బయట ఆమె కొన్ని గంటలు ఎదురుచూశారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని