Rajamouli: ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి

‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు.

Published : 20 May 2024 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చారు గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి. ఆయన్ని స్మరించుకుంటూ ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌కు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అతిథిగా వచ్చి సీతారామశాస్త్రి గొప్పతనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

‘ప్రపంచమంతా ఉన్నట్లే మా కుటుంబంలోనూ శాస్త్రిగారికి వీరాభిమానులున్నారు. ఆయన పాటలను విశ్లేషించుకుంటాం. ఆయన రాసే పాటలలాగే గంభీరంగా ఉంటారేమో అని భావించాను. కానీ, ఎప్పుడు కలిసినా సరదాగా జోకులు వేస్తూ ఉండేవారు. రాత్రిపూట మాత్రమే పాటలు రాస్తారని తర్వాత తెలిసింది. ఆయన నన్ను నంది అని పిలిచేవారు. ఇండస్ట్రీలో నన్ను అలా పిలిచేది శాస్త్రిగారు ఒక్కరే. మా సొంతం బ్యానర్‌పై ‘అర్ధాంగి’ అనే సినిమా తీశాం. అది ప్రేక్షకాదరణ పొందలేదు. మా నాన్న సంపాదించిన డబ్బంతా ఆ సినిమాకోసం ఉపయోగించారు. కానీ, అది చాలా పెద్ద ఫెయిల్యూర్‌ అయింది. దాంతో  నాన్న తీవ్ర నిరాశపడ్డారు. అప్పుడు శాస్త్రిగారి (Sirivennela Sitaramasastri) దగ్గరకు వెళ్లి నాన్న కోసం ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..’ పాట రాసిమ్మన్ని అడిగాను. అది చదివాక మా నాన్నలో చాలా ధైర్యం వచ్చింది. ఆ పాట నాలోనూ పలు సందర్భాల్లో స్ఫూర్తి నింపింది’.

ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్‌ గురించి ఈ సంగతులు తెలుసా?

‘నేను ఒక సినిమా తీస్తునాన్నంటే దాని వెనక చాలా మంది ఉంటారు. నన్ను నమ్మి నిర్మాతలు డబ్బులు పెడతారు. దాని ఫలితం సినిమా కోసం పనిచేసిన అందరిపై ఉంటుంది. ‘బాహుబలి’ తీసేముందు సీతారామశాస్త్రి గారిని కలిసి ఇలా సినిమా తీయాలనుకుంటున్నా కరెక్టా కాదా.. అని అడిగి సలహా తీసుకున్నా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో దోస్తి పాట రాశారు. చాలా సార్లు ఆయన పాటల్లో భావానికి ప్రాధాన్యతనిస్తారు. ఒక్కోసారి పాటలో ప్రాస రావడం కోసం పదాలకు ప్రాధాన్యమిస్తారు. అలాంటి పాటే ‘దోస్తి’. ఇదే సినిమాలో ‘నెత్తురు మరిగితే ఎత్తర కొండ’ పాట మొత్తం రాయాలని చాలా ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆరోగ్యం సహరించకపోవడంతో కొన్ని పదాలను రాసిచ్చి.. వాటిని పాటలో వాడుకోమన్నారు’ అని రాజమౌళి గుర్తుచేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని