Tollywood: వినోదాలు ఇంకా ఉన్నాయ్‌!

బాక్సాఫీస్‌కి ఈసారి విరామం లేదు. ఫిబ్రవరిలోనూ కొత్త సినిమాల జోరు కొనసాగనుంది. సీజన్‌ని తలపించేలా... విడుదల కోసం పోటాపోటీగా ముస్తాబవుతున్న సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.

Updated : 19 Jan 2024 09:28 IST

వచ్చే నెలలోనూ.. కొత్త చిత్రాల జోరు 

బాక్సాఫీస్‌కి ఈసారి విరామం లేదు. ఫిబ్రవరిలోనూ కొత్త సినిమాల జోరు కొనసాగనుంది. సీజన్‌ని తలపించేలా... విడుదల కోసం పోటాపోటీగా ముస్తాబవుతున్న సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.

తెలుగులో సంక్రాంతి సినిమాల ప్రదర్శనలు ముగిశాక బాక్సాఫీస్‌ దగ్గర ఒక రకమైన స్తబ్దత కనిపించడం రివాజు. రావాల్సిన అగ్ర తారల సినిమాలు పండగకే వచ్చేస్తుంటాయి. దాంతో మళ్లీ వేసవి కోసమే ఎదురు చూస్తుంటాయి సినీ వర్గాలైనా, అభిమాన గణమైనా! గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకట్రెండు సినిమాలు విడుదలవుతాయి, ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి మాసాన్ని చిత్రసీమ వర్గాలు  అన్‌సీజన్‌గా లెక్కగడుతుంటాయి. అర కొర చిన్న చిత్రాలే వస్తాయి తప్ప... చెప్పుకోదగ్గ సినిమాలన్నీ కూడా వేసవి లక్ష్యంగానే ముస్తాబవుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆ సీన్‌ రివర్స్‌ అవుతోంది. ఫిబ్రవరిలోనూ కీలకమైన పలు చిత్రాలు విడుదలకి సన్నద్ధమవుతున్నాయి. రవితేజ ‘ఈగల్‌’, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’,  గోపీచంద్‌ ‘భీమా’తోపాటు... తమిళం నుంచి రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించిన ‘లాల్‌ సలామ్‌’ కూడా వచ్చే నెలలోనే విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఇవి కాకుండా... పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాల జాబితా చూసినా పెద్దగానే కనిపిస్తుంది.

గతేడాది డిసెంబరు నుంచి బాక్సాఫీస్‌ దగ్గర ప్రముఖ తారల హంగామా మొదలైంది. ప్రభాస్‌తోపాటు, నాని, నితిన్‌, కల్యాణ్‌రామ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ఇక సంక్రాంతి సందర్భంగా మహేశ్‌బాబు, నాగార్జున, వెంకటేశ్‌ చిత్రాలొచ్చాయి. వీళ్లమధ్యకి ‘హను-మాన్‌’ వచ్చి సత్తా చాటుతున్నాడు. మరో కథానాయకుడు రవితేజ కూడా తన ‘ఈగల్‌’తో ఈ సంక్రాంతి సందర్భంగానే సందడి చేయాలనుకున్నా, ఆఖరి నిమిషంలో ఆయన సినిమా విడుదల ఫిబ్రవరికి మారింది. అలా వాయిదా పడిన సినిమాలు... ఫిబ్రవరి కోసమే ముస్తాబైన మరికొన్ని సినిమాలు కలిసి అదే నెలలోనే విడుదల ఖరారు చేసుకోవడంతో బాక్సాఫీస్‌ దగ్గర పోటీ గట్టిగానే కనిపిస్తోంది. సహజంగా సంక్రాంతికి తెలుగు సినిమాలతోపాటు, ఒకట్రెండు అనువాద చిత్రాలూ విడుదలవుతుంటాయి.  కానీ ఈసారి తెలుగు సినిమాల మధ్యే పోటీ ఉండటంతో తమిళం నుంచి చిత్రాలేవీ విడుదల కాలేదు. అప్పుడు రావల్సిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’, ‘అయలాన్‌’ చిత్రాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల ఖరారు చేసుకున్నాయి. ఒకవైపు సంక్రాంతి సినిమాలు, మరోవైపు ఈ అనువాదాలతోనే ఈ నెల గడిచిపోతుంది. ఇక ఫిబ్రవరిలోనే కీలకమైన సినిమాలు విడుదల కానున్నాయి.

9వ తేదీ కోసం...

వచ్చే నెల తొలి వారమంతా కూడా థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడే ఉంటుంది. అయినా సరే, కొన్ని పరిమిత వ్యయంతో రూపొందిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘ధీర’, ‘హ్యాపీ ఎండింగ్‌’ చిత్రాలు ఫిబ్రవరి 2న విడుదల కోసం సిద్ధమయ్యాయి. ఆ వారం తర్వాత వచ్చే 9వ తేదీ కోసం అసలు సిసలు పోటీ అంతా. ఆ తేదీన సోలో విడుదలకి సహకరిస్తామన్న చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి హామీతో రవితేజ ‘ఈగల్‌’ ఆ తేదీని ఖరారు చేసుకుంది. అయితే అదే రోజే సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ సినిమా వర్గాలు ప్రకటించాయి. తమిళం నుంచి రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘లాల్‌ సలామ్‌’ విడుదల కూడా ఖరారైంది. రజనీ సినిమాకి తెలుగులో ఉండే క్రేజ్‌ వేరు. ఇలా ఆ తేదీ కోసం సినిమాలు పోటీ పడుతుండడంతో పరిశ్రమ పెద్దలు విడుదలల విషయంలో కసరత్తులకి దిగక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

వరుణ్‌తేజ్‌.. గోపీచంద్‌ చిత్రాలు

డిసెంబరులోనే రావల్సిన వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ఆలస్యంగా  ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వరుణ్‌తేజ్‌ నటించిన ద్విభాషా చిత్రమిది. తెలుగుతోపాటు, హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎయిర్‌ఫోర్స్‌ డ్రామాతో కూడిన కథతో  శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన ‘భీమా’ చిత్రం  కూడా వచ్చే నెల 16నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. గోపీచంద్‌ పోలీసు పాత్రలో నటిస్తున్న చిత్రమిది. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్‌ శైలి మాస్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేశారు. వీటితోపాటు... మరో చిత్రం ‘సుందరం మాస్టర్‌’ కూడా అదే తేదీన విడుదల కానుంది. హర్ష చెముడు ప్రధాన పాత్రధారిగా... కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ‘టిల్లు స్క్వేర్‌’, ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ తదితర చిత్రాలూ ఈ నెల కోసమే ముస్తాబవుతూ వచ్చాయి. మరి వీటిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందనేది తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని