Student of the year: ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 3’లో శనయా కపూర్‌?

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ రూపొందించిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.

Updated : 02 Apr 2024 09:43 IST

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ రూపొందించిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మూడో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీప్రియులకు ఓ తీపి కబురు వినిపించారు కరణ్‌ జోహార్‌. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 3’ను అధికారికంగా ప్రకటించారు. ‘‘త్వరలో ఈ మూడో భాగం సిరీస్‌ రూపంలో మీ ముందుకు రాబోతుంది. దీనికి రీమా మాయ దర్శకత్వం వహిస్తుంది. ఆమె పేరు మాదిరిగానే ఆమెది కూడా ఓ వింత ప్రపంచం. అందులోకి నేను ప్రవేశిస్తే.. అది మరింత అద్భుతంగా మారుతుందని తెలుసు. కానీ.. ఇప్పుడు ఈ సిరీస్‌ను రూపొందించే బాధ్యత ఆమెది మాత్రమే’’ అంటూ చెప్పుకొచ్చారు కరణ్‌. త్వరలో మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘వృషభ’తో వెండితెరపైకి రాబోతున్న సంజయ్‌ కపూర్‌ కుమార్తె శనయా కపూర్‌ ఈ సిరీస్‌లో కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తుంది.


ఉత్కంఠగానే ప్రతి సన్నివేశం  

 అజయ్‌, రవి ప్రకాష్‌, హర్షిణి, మాండవియా సెజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కేస్‌ నెం 15’. తడకల వంకర్‌ రాజేశ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత సి.కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రం హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దీంట్లో ప్రతి సీన్‌ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు దర్శక నిర్మాత రాజేశ్‌. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌, ప్రసన్న కుమార్‌, రవి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


 ‘దాసి’ సుదర్శన్‌ ఇకలేరు

‘దాసి’ సుదర్శన్‌గా పేరు తెచ్చుకున్న కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పిట్టంపల్లి సుదర్శన్‌ (71) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు కళాదర్శకుడిగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి తీసిన ‘దాసి’ చిత్రానికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు రాగా ఇందులో ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవార్డును సుదర్శన్‌ అందుకున్నారు. జాతీయ స్థాయిలో అవార్డులను గుర్తించే జ్యూరీ సభ్యుడిగా ఉండి ఆ స్థానానికి ఎంతో హుందాతనం తీసుకొచ్చారు.
- న్యూస్‌టుడే, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని