Sudheer Babu: నేను చేసినట్టు ఏ హీరో కూడా యాక్షన్‌ చేయలేరు: సుధీర్‌బాబు

సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా నటిస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరోం హర’ (HAROMHARA). మాళవికా శర్మ కథానాయిక. జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ అంతటా విశేష ఆదరణ సొంతం చేసుకుంది.

Published : 04 Dec 2023 21:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘హరోం హర’ (HAROMHARA). కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమవుతోన్న ఈ చిత్రం పాన్‌ ఇండియాలో స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ‘హరోంహర’ టీజర్‌కు అంతటా విశేష ఆదరణ లభించింది. దీంతో చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘హరోం హర’ అనే టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి?

సాగర్‌: సుబ్రహ్మణ్య స్వామిని పూజించే సమయంలో ఎక్కువగా ‘హరోం హర’ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్టుగానే ఈ సినిమాలో తిరుగుబాటు అనేది ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో దీనిని తీర్చిదిద్దుతున్నాం. సినిమా కథకు అనుగుణంగానే ‘హరోం హర’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. అలాగే ఇందులో కుప్పం యాస ఉపయోగించాం.

యాక్షన్‌ హీరోగానే ఉండాలని మీరు అనుకుంటున్నారా? 

సుధీర్‌: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో గొప్ప నటుడిగా నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కెరీర్‌లో రాణించే సమయంలో ఒక జానర్‌కు ఫిక్స్‌ అవుతాం. అలా, యాక్షన్‌ తరహా కథలు నాకు బాగా సెట్‌ అవుతాయనే భావన కలిగింది. మంచి కథ ఉంటే తప్పకుండా యాక్షన్‌ చిత్రాల్లో నటిస్తా.

‘హరోం హర’ కథ ఓకే చేయడానికి ప్రధానం ఏమిటి?

సుధీర్‌: ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి కథలో నటించలేదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా చక్కగా కుదిరాయి. కథ, నటీనటుల పాత్రల చిత్రీకరణ, సినిమాలోని ప్రతి రంగంపై దర్శకుడికి ఉన్న అభిరుచి చూసి దీనికి ఓకే చెప్పా.

వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ కథ రాశారా?

సాగర్‌: ఇదొక ఫిక్షనల్‌ కథ. పీరియాడికల్‌ మూవీ. 1989-90 సంవత్సరాల మధ్యలో ఈ కథ జరిగినట్టు చూపించాం. నిజ జీవితంలో స్ఫూర్తి పొందిన పలు పాత్రలను ఆధారంగా చేసుకుని ఇందులో పాత్రలు క్రియేట్‌ చేశా.

ఈ సినిమా మీ కెరీర్‌కు ఎంతవరకూ ఉపయోగపడుతుంది?

సుధీర్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఘన విజయాన్ని అందుకున్న పెద్ద చిత్రాల స్థాయిలో ఈ సినిమా క్వాలిటీ ఉండనుంది. ఇప్పటికే మేము 90 శాతం షూట్‌ పూర్తి చేశాం. కీలక సన్నివేశాలు చూశా. చాలా బాగా వచ్చాయి. ఆ నమ్మకంతోనే చెబుతున్నా. తప్పకుండా ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

ఏదైనా కథ ఓకే చేసేటప్పుడు మీరు ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు? 

సుధీర్‌: కథ ఏదైనా సరే నేనొక ప్రేక్షకుడిగా వింటా. ప్రేక్షకులు దీనిని ఎంజాయ్‌ చేస్తారా? అనేది చూస్తా. అలాగే, నా కెరీర్‌కు ఇది ఎంతవరకూ ఉపయోగపడుతుంది? అనేది పరిగణనలోకి తీసుకుంటా. ఇందులో ఏ ఒక్కటి ఓకే అనిపించకపోయినా వెంటనే నో చెప్పేస్తా.

మీరు నటించిన ‘ప్రేమకథా చిత్రం’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. మీ గత చిత్రాలు వరుస పరాజయాలు అందుకున్నాయి. ‘ప్రేమకథా చిత్రం’లాంటివే చేయొచ్చు కదా..?     

సుధీర్‌: నా దృష్టిలో ‘హంట్‌’ అనేది డీసెంట్‌ ఫిల్మ్‌. ఆ సినిమా కొంతమందికి నచ్చలేదు. పలు కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఆ చిత్రాన్ని ప్రమోట్‌ చేయలేకపోయాం. ‘హంట్‌’, ‘మామా మశ్చీంద్ర’ చిత్రాలకు మరింత ఆదరణ రావాల్సిందనే భావన నాకు ఉంది. ‘ప్రేమకథా చిత్రమ్‌’ విషయానికి వస్తే.. ఆ సమయంలో మారుతి నాకు నాలుగు కథలు చెప్పారు. అందులో నేను ‘ప్రేమకథా చిత్రమ్‌’ కథ సెలెక్ట్‌ చేసుకున్నా. ఆయన చెప్పిన మిగతా కథలు కూడా నచ్చినప్పటికీ అప్పుడు నాకున్న మార్కెట్‌, బడ్జెట్‌ను ప్రామాణికంగా తీసుకున్నా. ఇప్పుడు నా మార్కెట్‌ కాస్త పెద్దదైంది. బడ్జెట్‌ ఎక్కువైనా సరే డబ్బులు పెట్టేందుకు నిర్మాత కూడా ఉన్నారు. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద స్కేల్‌లో చేస్తున్నా. ఈ సినిమాతోపాటు ‘మా నాన్న సూపర్‌హీరో’ అనే ఫ్యామిలీ, ఎమోషనల్‌ డ్రామాలో యాక్ట్‌ చేస్తున్నా.

మీ చిత్రాలు వరుస పరాజయాలు అందుకుంటున్నాయి కదా. కాస్త బ్రేక్‌ తీసుకుని ఎక్కడ తప్పు జరుగుతుందా అని ఆలోచించవచ్చు కదా..?

సుధీర్‌: నేనేమీ హడావుడిగా సినిమాలు చేయడం లేదు. ఫోకస్‌గా ఆలోచించే చేస్తున్నా. సంతకం చేసిన సినిమా పట్టాలెక్కిన తర్వాత బాలేదంటే నష్టపరిహారం చెల్లించి పక్కకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల నా సినిమాలు వరుసగా విడుదల కావడం వల్లే మీరు అలా అనుకుని ఉండొచ్చు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ విడుదలకు రెండు నెలల ముందే ‘మామా మశ్చీంద్ర’ని ఓకే చేశా. ఎన్నో కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.

ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి కారణం ఏమిటి?

సుధీర్‌: ఇది పాన్‌ ఇండియాలో స్థాయిలో చెప్పాల్సిన కథ ఇది. ‘మామా మశ్చీంద్ర’ కథ విన్నప్పుడు దానిని కూడా నేను పాన్‌ ఇండియా రిలీజ్‌ చేస్తే బాగుంటుందని అనుకున్నా. పలు కారణాల వల్ల అది పాన్‌ ఇండియాకు సెట్‌ కాదని ఫిక్స్‌ అయ్యా. కానీ ఇది మాత్రం తప్పకుండా పాన్‌ ఇండియా రిలీజ్‌కు సరిపోయే కథ.

యాక్షన్‌ పరంగా ఈ చిత్రానికి మీరు న్యాయం చేయగలిగారని అనుకుంటున్నారా?

సుధీర్‌: యాక్షన్‌ హీరో అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు? నా వరకూ నేను చేసిన యాక్షన్‌ ఏ హీరో చేయలేరు. కథ సపోర్ట్‌ చేస్తే సీజీ లేకుండా ఎలాంటి యాక్షన్‌ అయినా నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు. అది అయితే తప్పకుండా చెప్పగలను. జాకీచాన్‌కు నేను అభిమానిని. నేను సినిమాల్లోకి రాకముందు.. మా ఇంటి పక్కన థియేటర్‌లో జాకీచాన్‌ సినిమాలు విడుదలైనప్పుడు రోలింగ్‌ టైటిల్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ చూడటం కోసమే నేను వెళ్లేవాడిని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని