Sudheer Babu: హంట్‌.. ఓ సాహసం

‘‘హంట్‌’ (Hunt) ప్రతి హీరో ప్రయత్నించే కథ కాదు. నేనిలాంటి కథ చేయడాన్ని ప్రేక్షకులు స్వీకరిస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు సుధీర్‌బాబు (Sudheer Babu).

Updated : 25 Jan 2023 06:52 IST

‘‘హంట్‌’ (Hunt) ప్రతి హీరో ప్రయత్నించే కథ కాదు. నేనిలాంటి కథ చేయడాన్ని ప్రేక్షకులు స్వీకరిస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు సుధీర్‌బాబు (Sudheer Babu). ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మహేష్‌ (Mahesh) తెరకెక్కించారు. శ్రీకాంత్‌ (Srikanth), భరత్‌ (Bharath) కీలక పాత్రలు పోషించారు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుధీర్‌బాబు.


అందరూ నేను 24గంటలూ జిమ్‌లోనే గడిపేస్తానేమో అనుకుంటారు. కానీ, అది వాస్తవం కాదు. కొన్నిసార్లు ఇక జిమ్‌ చేయకూడదు.. నా ఫిజిక్‌ ఫొటోలు బయటకు ఇవ్వకూడదు అనిపిస్తుంటుంది. ఎందుకంటే దాని వల్ల నటుడిగా నా పని కంటే ఆ ఫిజిక్‌, ఫిట్‌నెస్‌, జిమ్‌ గురించే ఎక్కువ మాట్లాడుతుంటారు’’.


నేను ప్రస్తుతం హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra)అనే సినిమా చేస్తున్నా. నేనిందులో త్రిపాత్రాభినయం చేస్తున్నా. ఓ పాత్రలో 150కేజీలు ఉన్న వ్యక్తిగా.. ఇంకో పాత్రలో సిక్స్‌ ప్యాక్‌ లుక్‌తో కనిపిస్తా. మరో పాత్రలో సన్నగా కనిపిస్తా. అలాగే యువి క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథతో రూపొందుతోంది’’.


ప్రీరిలీజ్‌ వేడుకలో కృష్ణ (Krishna) గారిచ్చిన ధైర్యంతోనే ఈ చిత్రం చేశానని చెప్పారు. ఎందుకలా?

‘‘ఇదొక సాహసోపేతమైన ప్రయత్నం. ఆయన చాలా ప్రయోగాలు చేశారు. కానీ, ఇలాంటి కథ చేసి ఉండకపోవచ్చు. ఆయన కెరీర్‌ అంతా కొత్తగా ప్రయత్నించారు కాబట్టి ఈ సినిమా చూసి ఏమంటారో తెలుసుకోవాలనుకున్నా. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్‌ చేయడం.. లేదంటే ఇంటికి పిలిచి మాట్లాడటం చేసేవారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలైనప్పుడు మాట్లాడాను. అప్పుడు కూడా ‘హంట్‌’ చూసి ఏమంటారోనని అనుకున్నా. నన్ను ప్రశంసిస్తారనుకున్నా. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడం వెలితిగా ఉంది’’.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘ఇందులో నేను అర్జున్‌ అనే పోలీస్‌ అధికారిగా కనిపిస్తా. ఈ పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. గతం మర్చిపోవడానికి ముందు.. అర్జున్‌ ఎ పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా ఉంటుంది. కానీ, గతం మర్చిపోయిన తర్వాత.. అర్జున్‌ బి పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంది. నాకు ఈ పాత్రే కొంచెం కష్టమైంది. మెమోరీ లాస్‌ మీద వచ్చిన ‘గజినీ’ లాంటి పాత్రలకు పోలిక ఉండకూడదని కొత్తగా ప్రయత్నం చేశాం’’. 

ఈ చిత్ర యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం చాలా కష్టపడ్డారు. అంత రిస్క్‌ అవసరమా అనిపించలేదా?

‘‘నాకు రిస్క్‌ ఏం కాదు. రోప్స్‌ ఉంటేనే రిస్క్‌ ఎక్కువ. స్వతహాగా నేను స్పోర్ట్స్‌ పర్సన్‌ కావడం వల్ల ప్రతిదీ తేలికగా చేసుకుంటూ వెళ్లిపోయా. ఈ సినిమాలోని యాక్షన్‌ అంతా సహజంగా వాస్తవికతకు దగ్గరగా ఉండాలని ‘జాన్‌ విక్‌’ చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పోరాట ఘట్టాల్ని పూర్తి చేశాం. ఇందులో ఫైట్‌ సీక్వెన్స్‌ మొత్తాన్నీ విదేశీ కొరియోగ్రాఫర్లతోనే తెరకెక్కించాం. ఇందుకోసం నాలుగు రోజుల సమయం పట్టింది. వాటిని ఇక్కడ వాళ్లకు చూపించి.. నాలుగు రోజుల్లో షూట్‌ చేశామంటే అసలు నమ్మరు. మేము రెండు రోజులు ప్రాక్టీస్‌ చేసి.. నాలుగు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. స్టంట్స్‌ పరంగా ఇందులో చాలా కొత్త ప్రయత్నాలు చేశాం. వాటిని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’.

ఈ చిత్ర విషయంలో యాక్షన్‌ పరంగా కాకుండా కొత్తగా ఇంకేమైనా ప్రయత్నించారా?

‘‘సినిమా మొత్తం రిస్క్‌ చేశాం. ఇందులో హీరోయిన్‌ లేదు. మేం అక్కడే రూల్‌ బ్రేక్‌ చేశాం. రెండు నిమిషాల్లోనే కథలోకి వెళ్లిపోతారు. కథ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. సుదీర్ఘమైన పోరాట ఘట్టాలుంటాయి. పేపర్‌ మీద కథ ఉన్నప్పుడు రిస్క్‌ అనిపించొచ్చు. కానీ, నేను సినిమా చూశా. మా కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు చూశారు. అందరికీ నచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్‌ కథల్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నా’’.

కథ, పాత్రల పరంగా ప్రయోగం చేశామంటున్నారు. అదీ కొత్త దర్శకుడితో. సవాల్‌గా అనిపించలేదా?

‘‘మనం యాభై.. అరవై కథలు వింటుంటే ఒక మంచి కథ దొరుకుతుంది. దాన్ని ఎందుకు వదులుకోవడం. స్క్రిప్ట్‌లో నాకేమైనా అనుమానాలు ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా. తర్వాత టెస్ట్‌ షూట్‌ చేయమని చెబుతా. పైగా ఈ చిత్రానికి భవ్య క్రియేషన్స్‌ అండగా ఉంది కదా. వాళ్లు ఉండటంతో నాకు మరింత నమ్మకం వచ్చింది’’.


మీ ‘హంట్‌’ ఎవరి కోసం?

‘‘అది తెరపై చూస్తేనే బాగుంటుంది (నవ్వుతూ). సినిమాలో నేనెవరిని ‘హంట్‌’ చేస్తున్నానన్నది ఆద్యంతం సస్పెన్స్‌గానే ఉంటుంది. ఇందులో నేను ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. అద్భుతమైన ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రంలో ప్రేమకథ లేదు. స్నేహం నేపథ్యంలో సాగే బలమైన భావోద్వేగాలు ఉంటాయి. సినిమాలో ఎన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నా.. అవి ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాయి. ఈ చిత్రానికి ప్రధాన బలం ఎమోషనే’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని