Calling Sahasra: ఆ తర్వాత 130 కథలు విన్నా

బుల్లితెరతో ప్రేక్షకులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్‌. ఇప్పుడు కథానాయకుడిగానూ వెండితెరపై సందడి చేస్తున్నారు.

Updated : 01 Dec 2023 10:40 IST

బుల్లితెరతో ప్రేక్షకులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్‌. ఇప్పుడు కథానాయకుడిగానూ వెండితెరపై సందడి చేస్తున్నారు. ‘గాలోడు’ విజయం తర్వాత ఆయన కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ప్రయాణం గురించి సుధీర్‌ గురువారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

‘కాలింగ్‌ సహస్ర’ ఎలాంటి సినిమా? ఈ కథని ఒప్పుకోవడానికి ప్రధాన కారణమేమిటి?

ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తరహా కథే. నేర నేపథ్యం, ప్రేమ కోణం, డార్క్‌ వెబ్‌ అనే మరో కొత్త అంశం... ఇలా మూడు పార్శ్వాలుగా ఉంటుందీ చిత్రం. ‘గాలోడు’ సమయంలోనే ఈ సినిమానీ మొదలుపెట్టాం. ఒకటి మాస్‌, మరొకటి క్లాస్‌ అన్నట్టుగా ఉంటుందని ఈ రెండింటినీ ఒకేసారి ఒప్పుకుని చేశా. మాస్‌ ప్రేక్షకులు అంతగా నన్ను ఆదరిస్తారని ‘గాలోడు’ విడుదల రోజు వరకూ నాకు తెలియదు. మాస్‌ ప్రేక్షకులు నన్ను అమితంగా స్వీకరించారని ‘కాలింగ్‌ సహస్ర’ని పక్కనపెట్టలేను కదా! ఈ సినిమానీ అదే స్థాయిలో ఆదరించారంటే ఇకపై నేను ఇలా విభిన్నమైన కథలు ప్రయత్నించేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నేను మాస్‌ చేస్తేనే చూస్తారా అనేది కూడా ఈ సినిమా తర్వాత తెలుస్తుంది.

ఇదొక ప్రయోగం అనుకోవచ్చా?

నావరకూ ఇదొక ప్రయోగమే. ఫలితం ఎలా ఉంటుందనేది శుక్రవారం తెలుస్తుంది. నన్ను నేను తెరపై కొత్తగా చూసుకుంటున్న అనుభూతి
కలిగింది. 

‘జబర్దస్త్‌’ ఇమేజ్‌ మీ దగ్గరికి వచ్చే కథలపై ఎంత వరకూ ఉంటోంది?

నేను వింటున్న కథల్లో ఆ ఇమేజ్‌ ప్రభావం చాలా ఉంటోంది. లవర్‌బాయ్‌ కథలతో కొద్దిమంది, కామెడీ కథలతో కొద్దిమంది వస్తున్నారు. అందులో రొమాంటిక్‌ కథలు కూడా ఉంటున్నాయి. అయితే ‘జబర్దస్త్‌’ తరహాలోనే  నేను కామెడీ కథే చేశాననుకోండి. ఇక్కడ కామెడీ, అక్కడా కామెడీ కొత్తగా ఏమీ లేదు అంటారు. ఆ కామెడీ కూడా ఆశించిన స్థాయిలో పండలేదంటే, దీనికంటే జబర్దస్త్‌లోనే మేలు కదా అంటుంటారు. వీటి నుంచి బయట పడాలనే విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నా. అయితే కామెడీ మాత్రం ఎప్పటికీ వదలను. ఇప్పుడు చేస్తున్న కథల్లా కాకుండా  నువ్వు నవ్విస్తేనే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తే తప్పకుండా ఆ తరహా కథలతోనే ప్రయాణం చేస్తా.

టెలివిజన్‌లో వినోదం, సినిమాతో వినోదం పంచడానికి చాలా తేడా ఉంటుంది. ఓ కథానాయకుడిగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొంటున్నారు?

టెలివిజన్‌ వరకూ రేటింగ్‌ బాగుండాలి, ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలనేదే చూస్తాం. హిట్‌, ఫ్లాప్‌ అనేది ఉండదు. నెలకి 15 రోజులు షూటింగ్‌లు చేసుకుంటూ హాయిగా ప్రయాణం చేసేవాణ్ని. సినిమాకి వచ్చేసరికి చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ప్రేక్షకుడి టికెట్‌, నిర్మాత పెట్టుబడి, దర్శకుడి కెరీర్‌... ఇలా చాలా విషయాలు ఉంటాయి. ‘గాలోడు’ తర్వాత కొత్త సినిమాల కోసం కథలు వింటున్న సమయంలో నాకు వెన్నెముక నొప్పి తీవ్రంగా వచ్చింది. వైద్యుల దగ్గరికి వెళితే ఎక్కువ ఒత్తిడి తీసుకుంటున్నావని చెప్పారు. అప్పుడు అర్థమైంది సినిమా ప్రయాణంలో ఎన్ని సవాళ్లు ఉంటాయో!  ‘గాలోడు’ తర్వాత దాదాపు 130కిపైగా కథలు విన్నా. ఆ తర్వాత ‘గోట్‌’ ఎంచుకున్నా. పరాజయం కంటే విజయం విసిరే సవాళ్లు ఎక్కువగా ఉంటాయని అర్థమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని