Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. 

Published : 24 Mar 2024 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఈ చిత్రంలో హర్ష పోషించిన పాత్రను ఉద్దేశిస్తూ.. ‘‘మాస్టర్‌ హోమ్‌ ట్యూషన్స్‌ చెప్పడానికి మన ఇంటికి వస్తున్నాడు. రెడీగా ఉండండి’’ అని వ్యాఖ్యానించింది. దివ్య శ్రీపాద, హర్ష వర్ధన్‌, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషించి, అలరించారు. ఈ సినిమాని ప్రముఖ హీరో రవితేజ నిర్మించడం విశేషం.

క‌థేంటంటే: సుంద‌రం మాస్ట‌ర్ (హ‌ర్ష‌) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎక్కువ క‌ట్నం ఇచ్చే సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఇంత‌లో ఎమ్మెల్యే (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌)కి  మిర్యాల మెట్ట నుంచి ఓ ఉత్త‌రం అందుతుంది. ఆ గ్రామస్థులకు ఇంగ్లిష్ టీచ‌ర్ కావాల‌నేది దాని సారాంశం. బ‌య‌ట ప్ర‌పంచంతో సంబంధం లేని ఆ ఊరికి వెళ్లి ఇంగ్లిష్ పాఠాలు చెప్పే బాధ్య‌త‌ని తీసుకుంటాడు సుంద‌రం మాస్ట‌ర్‌. బ‌య‌టివాళ్లకి ఎవ్వ‌రికీ ప్ర‌వేశం లేని ఆ ఊళ్లో విలువైన వ‌స్తువు ఏదో ఉందనీ, దాన్ని క‌నిపెట్టే బాధ్య‌త‌ని కూడా సుంద‌రం మాస్ట‌ర్‌కి అప్ప‌జెబుతారు. అది క‌నిపెడితే  డీఈఓ పోస్ట్ కూడా ఇస్తాన‌ని మాటిస్తాడు ఎమ్మెల్యే. డీఈఓ అయితే ఇంకా ఎక్కువ క‌ట్నం వ‌స్తుంద‌నే ఆశ‌తో ఆ ఊరికి బ‌య‌ల్దేరతాడు సుంద‌రం. తీరా అక్క‌డికెళితే ఊళ్లో అంద‌రూ మాస్టర్‌ కన్నా బాగా ఇంగ్లిష్‌లో మాట్లాడతారు. ‘అస‌లు నీకే ఇంగ్లిష్ రాదు’ అంటూ ఆ టీచర్‌కు ప‌రీక్ష పెడ‌తారు. ఆ టెస్ట్‌లో ఫెయిల్ అయితే ఉరేస్తాం అని హెచ్చ‌రిస్తారు. మ‌రి ఆ ప‌రీక్ష‌లో సుంద‌రం మాస్టర్‌ పాస‌య్యాడా?ఇంగ్లిష్ అంత బాగా మాట్లాడుతున్నా వాళ్లు ఇంగ్లిష్ మాస్ట‌ర్ కావాల‌నుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? ఊళ్లో విలువైన వ‌స్తువుని సుంద‌రం క‌నిపెట్టాడా? అత‌ను ఊరి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? ఇంత‌కీ ఆ ఊరి వెన‌కున్న చ‌రిత్ర ఏమిటి? త‌దిత‌ర ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని