Bollywood: రాముడిపాత్రకు రణ్‌బీర్‌ సరైన ఎంపిక..: రామాయణం నటుడు

అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న రామాయణం సినిమాలోని పాత్రల ఎంపికపై నటుడు సునీల్‌ లహ్రీ తన అభిప్రాయాన్ని చెప్పారు. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు.

Published : 30 Jun 2023 19:04 IST

ముంబయి: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మరికొందరు బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో నటించే తారాగణంపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కోసం నటీనటులకు లుక్‌ టెస్ట్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో ఈ మధ్య కాలంలో సందడి చేశాయి.

ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను (Ranbir Kapoor) ఓకే చేసిందట చిత్రబృందం. అలాగే సీత పాత్ర కోసం అలియాభట్‌కు లుక్‌ టెస్ట్‌ చేశారట. తాజాగా వీరి ఎంపికపై రామాయణం నటుడు సునీల్‌ లహ్రీ (Sunil Lahri) ఓ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లిద్దరూ మంచి నటీనటులు. కచ్చితంగా కథకు న్యాయం చేస్తారు. రాముడిగా రణ్‌బీర్‌ సరైన ఎంపిక. అతడు కచ్చితంగా ఆ పాత్రకు సరిపోతాడు. ఇక అలియా కూడా చాలా టాలెంటెడ్‌ నటి. కానీ, గతంలో ఈ తరహా పాత్రలు చేసి ఉంటే సీత పాత్రకు మరింత న్యాయం చేయగలదని నా అభిప్రాయం. గత కొన్నేళ్లలో అలియాలో ఓ నటిగా చాలా మార్పులు వచ్చాయి. మరి సీతగా ఎలా అలరిస్తుందో చూడాలి’’ అన్నారు. ఇక ఈ సినిమాలో రావణుడిగా యశ్‌ నటిస్తున్నాడనే వార్తలు ఇటీవల వైరలయ్యాయి. తాజాగా దీనిపై యశ్‌ క్లారిటీ ఇచ్చాడు. తాను బాలీవుడ్‌ సినిమాల్లో నటించడం లేదని స్పష్టం చేశారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో సునీల్‌ లహ్రీ రామాయణం సీరియల్‌ రీ టెలికాస్ట్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘రామాయణం అందరి జీవితాల్లో భాగమైంది. మన ఇళ్లలో దాన్ని మననం చేసుకుంటూనే ఉన్నా. అది ఇప్పుడు బుల్లి తెరపై మరోసారి కనిపించనుంది’’ అని చెప్పారు. రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన రామాయణం (Ramayan) సీరియల్‌ జులై 3 నుంచి రీ టెలికాస్ట్‌ కానున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని