suriya: ‘యానిమల్‌’ మూవీ తమిళ వెర్షన్‌.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి

‘యానిమల్‌’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్‌ అని దర్శకుడు సందీప్‌ అన్నారు.

Published : 16 Apr 2024 00:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ ( Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘యానిమల్’ (Animal). గతేడాది విడుదలైన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న దర్శకుడు సందీప్‌రెడ్డి ఈ సినిమాకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘యానిమల్‌’ తమిళ వెర్షన్‌లో రణ్‌బీర్‌ పాత్రను ఏ నటుడు చేస్తే బాగుంటుందని అడగ్గా, మరో ఆలోచన లేకుండా ‘సూర్య నటిస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ మాట చెప్పగానే కార్యక్రమానికి వచ్చిన అతిథులు, ప్రేక్షకుల నుంచి విజిల్స్‌, చప్పట్లు మార్మోగాయి.

‘యానిమల్‌’ విడుదలైన తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ నటనను పొగుడుతూనే ఆయన పోషించిన విజయ్‌ పాత్ర సూర్య నటించిన ‘రోలెక్స్‌’కు దగ్గరగా ఉందంటూ కామెంట్లు వినిపించాయి. ‘విక్రమ్‌’ మూవీలో సూర్య కనిపించేది కొద్దిసేపే అయినా థియేటర్‌ దద్దరిల్లిపోయేలా ఆయన నటన ఉంటుంది. పాతికేళ్లు కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్చేసిన వారిపై పగ తీర్చుకుంటానని, ‘తల తీసుకొచ్చిన వారికి లైఫ్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తా’ అంటూ శపథం చేస్తూ, ఆయన పలికే సంభాషణలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.

ఇక సూర్య (Suriya) సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో ‘కంగువా’లో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.  సందీప్‌రెడ్డి వంగా ప్రభాస్‌ కోసం ‘స్పిరిట్‌’కథను సిద్ధం చేస్తున్నారు.  ఈ ఏడాది చివరి నాటికి ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇప్పటివరకూ ప్రభాస్‌ను ప్రేక్షకులు చూడని సరికొత్త అవతార్‌లో సందీప్‌ ప్రజెంట్‌ చేయనున్నారని టాక్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని