Suriya44: కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో

 ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు.

Published : 28 Mar 2024 21:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య(Suriya) తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘‘కార్తిక్‌ సుబ్బరాజుతో ‘సూర్య44’(Suriya44) ‘లవ్‌ లాఫ్టర్‌ వార్‌’ చిత్రాన్ని చేయబోతున్నా. ఇదో కొత్త ప్రారంభం. మీ అందరి ఆశీర్వాదం కావాలి’’ అని సూర్య ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. మరోవైపు,  సూర్య సుధా కొంగర దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ‘సురారై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇది. ‘సూర్య43’(Suriya43) వర్కింగ్‌ టైటిల్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుంది. ఇందులో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, నజ్రియా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం సూర్య ‘కంగువా’లో నటిస్తున్నారు. దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి దిశా పఠానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జగపతిబాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని