Sushmita Sen: వైద్య పరీక్షల్లో అంతా సరిగా ఉన్నట్లే వచ్చింది.. కానీ అలా జరిగింది: సుస్మితా సేన్‌

ఏడాదిలో రెండుసార్లు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ తనకు గుండెపోటు వచ్చినట్లు ప్రముఖ బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ అన్నారు.

Updated : 03 Nov 2023 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌(Sushmita Sen) ఈ ఏడాది మార్చిలో గుండెపోటుకు గురైనట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్‌ వేశారు. అయితే ఏడాదికి రెండు సార్లు గుండె పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ ఇటీవల తాను గుండెపోటుకు గురైనట్లు వాపోయారు. గుండె నిర్మాణం, పనితీరును చెక్‌ చేసే ఎకోకార్డియోగ్రామ్‌(Echo Test) టెస్టులోనూ అంతా సరిగానే ఉందని రిపోర్టు వచ్చినప్పటికి ఇలా అయిందన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి సంబంధించి సుస్మితా సేన్‌ పలు విషయాలు పేర్కొన్నారు. 

తన తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉన్నాయని, జన్యుపరంగా తనకి సైతం ఉంటాయని ఒక అవగాహన ఉందన్నారు. అందువల్లే తాను సైతం ఏడాదికి రెండుసార్లు గుండెకి సంబంధించి వైద్యపరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల తనకు గుండెపోటు రావడానికి 6 నెలల ముందు సైతం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. అప్పుడు అంతా సరిగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని అయితే అకస్మాత్తుగా ఇలా జరగడం షాక్‌కు గురిచేసిందన్నారు. 

సుస్మితా సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆర్య’(Aarya) సీజన్‌ 3 నవంబర్‌ 3 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌ చేస్తున్న సమయంలోనే సుస్మితాసేన్‌ గుండెపోటుకు గురయ్యారు. ఆర్య ట్రైలర్‌లో చూపించిన ఒక యాక్షన్‌ సీన్‌ను తనకి గుండెపోటు వచ్చిన నెల తర్వాత తీసినట్లు చెప్పారు. ట్రైలర్‌లో బుల్లెట్‌ తగలడంతో కిందపడి ఊపిరి తీయడానికి ఇబ్బంది పడ్డట్లుగానే నిజజీవితంలోనూ గుండెపోటుతో తాను ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. తెరపై, వ్యక్తగతంగా ఆ దశ ఎంత చీకటిగా అనిపించినప్పటికీ ఆ తర్వాత జీవితం మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు