Kalki: ‘కల్కి’లో ప్రభాస్‌ పేరేంటో తెలుసా.. అప్‌డేట్‌ షేర్‌ చేసిన టీమ్..

ప్రభాస్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది.

Updated : 08 Mar 2024 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌తో శుభాకాంక్షలు చెప్పిన టీమ్‌ తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌ పేరును తెలుపుతూ పోస్ట్‌ పెట్టింది. ఇందులో ఆయన పేరు  ‘భైరవ’ అని ప్రకటించింది. ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్‌ వస్తుండడంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్‌, దిశా పటానీ (Disha Patani)లపై పాటను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను నిర్మాణ సంస్థ పంచుకుంది. ఇక ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం. హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్లేడ్‌ రన్నర్‌’ పోలికలు ఇందులో కనిపించనీయలేదు. అది మాకు పెద్ద సవాల్‌గా మారింది’’ అని చెప్పారు.

ఇందులో పలు భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని