Teja Sajja: తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్‌ ఏమిటంటే..?

‘హనుమాన్‌’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు.

Published : 18 Apr 2024 14:37 IST

హైదరాబాద్‌: ‘హను మాన్‌’ (Hanuman)తో ఈ ఏడాది ఆరంభంలోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja). ఆ సినిమా తర్వాత ఆయన చేయనున్న ప్రాజెక్ట్‌లపై ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలోనే తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. ‘ఈగల్‌’ దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేనితో ‘మిరాయ్‌’ (Mirai) కోసం వర్క్‌ చేయనున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో పాన్‌ వరల్డ్‌ మూవీగా ఇది విడుదల కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం పాల్గొని పలు విశేషాలు పంచుకుంది.

తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘‘హనుమాన్’ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి సపోర్ట్‌తోనే ముందుకు అడుగు వేస్తున్నా. ప్రేక్షకులను అలరించేందుకు ప్రతిరోజూ కష్టపడి చేస్తున్నా. ‘మిరాయ్‌ ది సూపర్‌ యోధ’ను భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నాం. కార్తిక్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు పదేళ్ల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. మేము అనుకున్న దానిని తెరకెక్కించడంలో విశ్వప్రసాద్ మాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న దీనిని విడుదల చేయనున్నాం’’ అని ఆయన అన్నారు.

‘ఈగల్‌’ టెక్నికల్‌గా బాగున్నప్పటికీ కథ పరంగా మిశ్రమ స్పందనలు వచ్చాయి? వాటిని ఎలా తీసుకున్నారు?

కార్తిక్‌: ఆ సినిమా రిలీజ్‌ తర్వాత చాలామంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. వాటిలో వివరణాత్మక స్పందనలను మాత్రమే నేను స్వీకరించా. ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నా. ముందుకు అడుగులు వేస్తున్నా.

20 రోజుల్లోనే ‘మిరాయ్‌’ గ్లింప్స్‌ను షూట్‌ చేశారా?

కార్తిక్‌: ‘హనుమాన్‌’, ‘ఈగల్‌’ చిత్రాల రిలీజ్‌లకు ముందే ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేశా. దాదాపు రెండేళ్ల నుంచి దీనికోసం సన్నాహాలు  మొదలుపెట్టాం. కొంతకాలం క్రితం కొన్ని సీన్స్‌ షూట్‌ చేశాం. గ్లింప్స్ కోసం ప్రత్యేకంగా షూట్‌ చేయలేదు.

దుల్కర్‌ సల్మాన్‌, మంచు మనోజ్‌ ఈ చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నారని టాక్.. అందులో నిజమెంత?

కార్తిక్‌: మనోజ్‌ ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు నాడు ప్రకటించాలనుకుంటున్నా.

‘మిరాయ్‌’ స్క్రిప్ట్‌ మీ వద్దకు ఎప్పుడు వచ్చింది?

తేజ: కార్తిక్‌తో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఆయన వద్ద ఈ కథ ఉందని ముందే తెలుసు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ స్క్రిప్ట్ నాకు చెప్పారు. ఫిక్షన్‌, ఫాంటసీ కలిసిన కథ ఇది. వ్యక్తిగతంగా నాకు ఈ జోనర్‌ చిత్రాలంటే చాలా ఇష్టం.   

ఈ ప్రాజెక్ట్‌ను ఎన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు?

విశ్వప్రసాద్‌: పాన్‌ వరల్డ్‌ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం.

ఈ సినిమా కోసం ఏమైనా కసరత్తులు చేస్తున్నారా?

తేజ: కథ డిమాండ్ చేస్తే సిక్స్‌ ప్యాక్‌ చేయడానికి కూడా సిద్ధమే. పాత్రకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నా. మా సినిమా కోసం విదేశీ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వర్క్‌ చేస్తున్నారు. మలేషియా వెళ్లి కొన్ని రోజుల పాటు ఆయన వద్ద శిక్షణ తీసుకున్నా.

‘రాజాసాబ్‌’ గురించి ఏమైనా అప్‌డేట్‌ ఇవ్వగలరు?

విశ్వప్రసాద్‌: ‘రాజాసాబ్‌’ షూట్‌ రెగ్యులర్‌గా జరుగుతుంది. ‘ప్రాజెక్ట్ కె’ తర్వాత ఆ సినిమా గురించి అప్‌డేట్స్‌ ఇస్తాం. ఒక ఈవెంట్‌ పెట్టి రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తాం.

తేజ: ఆ సినిమా నుంచి త్వరలోనే ఓ పాట విడుదలవుతుందని నాకెందుకో అనిపిస్తుంది.

జై హనుమాన్‌లో మీరు యాక్ట్‌ చేస్తున్నారా? లేదా?

తేజ: ఆ సినిమా ఆంజనేయస్వామిపై ఉంటుంది. అదేవిధంగా హనుమాన్‌ (తన పాత్రను ఉద్దేశించి) కూడా ఉంటాడు.

మిరాయ్‌తో హిట్‌ కొట్టాక మీరు పెళ్లి చేసుకుంటారంట? 

తేజ: ఈ వార్త నేను మొదటిసారి వింటున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని