Pan India movies: తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!

పాన్‌ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

Updated : 20 May 2024 01:58 IST

పాన్‌ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తళుక్కున మెరిసే అతిథి పాత్ర కావొచ్చు.. సవాల్‌ విసిరే ప్రతినాయక పాత్రలు కావొచ్చు.. మంచి పాత్ర దొరికిందనిపిస్తే చాలు ఇమేజ్‌లు పక్కకు పెట్టి మరీ మన కథల్లో సందడి చేసేందుకు సమాయత్తమైపోతున్నారు. ఇప్పుడిలా భిన్నమైన పాత్రలతో తెలుగు తెరపై కనువిందు చేయనున్న బాలీవుడ్‌ కథానాయకులు పలువురు కనిపిస్తున్నారు. మరి వారి చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండి.. 


తెలుగు సినిమాల్లో ఉత్తరాది తారలు సందడి చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే కొన్నేళ్ల క్రితం వరకు ఈ విషయంలో కథానాయికల హవానే ఎక్కువ కనిపించేది. ఏటా ఒకరిద్దరు బాలీవుడ్‌ స్టార్‌ నాయికలైనా తెలుగు తెరపై తళుక్కున మెరుస్తుండేవారు. కానీ, బాలీవుడ్‌ కథానాయకుల్లో ఇటు వైపు దృష్టి సారించినవారు చాలా తక్కువే. అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ ఖాన్‌ తదితరులు గతంలో ఒకటి రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో సందడి చేసినా పూర్తి స్థాయి పాత్రలతో అలరించిన వారు ఎవరూ లేరు. ఇటీవల కాలంలో పాన్‌ ఇండియా ట్యాగ్‌తో తెలుగు సినిమాలు సత్తా చాటడం మొదలైనప్పటి నుంచే హిందీ హీరోలు మన కథలపై ఆసక్తి చూపించడం మొదలైంది. ఈ క్రమంలోనే అమితాబ్‌ బచ్చన్‌ ‘సైరా నరసింహారెడ్డి’లో.. అజయ్‌ దేవగణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో.. సల్మాన్‌ఖాన్‌ ‘గాడ్‌ ఫాదర్‌’లో ముఖ్య పాత్రలు పోషించి సినీప్రియుల్ని మురిపించారు. బిగ్‌బి ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898ఎ.డి’లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే తరహాలో మరికొందరు బాలీవుడ్‌ స్టార్లు తెలుగులో భిన్నమైన పాత్రలతో అలరించేందుకు సమాయత్తమవుతున్నారు.

అక్కడ హీరోయిజం.. ఇక్కడ విలనిజం

ప్రస్తుతం తెలుగులో తొలి అడుగులు వేస్తున్న హిందీ హీరోల్లో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది ప్రతినాయక పాత్రలతోనే మురిపించేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘కేజీఎఫ్‌’ సినిమాలో అధీరా అనే శక్తిమంతమైన ప్రతినాయక పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మురిపించారు బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌. ఇప్పుడాయన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో సంజయ్‌ కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. సంజయ్‌ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో కలిసి ‘రాజాసాబ్‌’లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. ప్రభాస్‌ తొలి హిందీ సినిమా ‘ఆదిపురుష్‌’లో లంకేష్‌గా కనిపించి అందర్నీ మెప్పించారు సైఫ్‌ అలీ ఖాన్‌. ఇప్పుడాయన ‘దేవర’తో తెలుగు తెరకు ప్రతినాయకుడిగా పరిచయం కానున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో తారక్‌ను ఢీ కొట్టే విలన్‌గా భైరా పాత్రలో సైఫ్‌ కనిపించనున్నారు. కొత్తదనం నిండిన ప్రేమకథలకు చిరునామాగా నిలుస్తూ బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో లవర్‌బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇమ్రాన్‌ హష్మీ. ఇప్పుడాయన తెలుగు ప్రేక్షకుల్ని ‘ఓజీ’తో ఓమి భావుగా భయపెట్టనున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్‌ చిత్రాన్ని సుజీత్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌తో తలపడే విలన్‌గా ఓమి పాత్రలో ఇమ్రాన్‌ కనిపిస్తారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ఇమ్రాన్‌ హష్మి ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో ‘జి2’లోనూ నటిస్తున్నారు. ‘గూఢచారి’కి కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. బాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా విభిన్నమైన పాత్రలు పోషించి సినీప్రియుల్ని అలరించారు బాబీ దేవోల్‌. ఇటీవలే ‘యానిమల్‌’తో హిట్టు కొట్టిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ - బాబీల సినిమాతో తెలుగు తెరకు ప్రతినాయకుడిగా పరిచయం కానున్నారు. నిజానికి ఆయన దీని కన్నా ముందే తెలుగులో ‘హరి హర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగారు. కానీ, అది చిత్రీకరణ ఆలస్యమవడం వల్ల ఇంకా పూర్తి కాలేదు. బాబీ త్వరలో నాగార్జునకు ప్రతినాయకుడిగా ఓ సినిమా చేయనున్నారని సమాచారం. నవీన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జులైలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. 


‘కన్నప్ప’తో అక్షయ్‌..

యాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. ఇప్పుడాయన ‘కన్నప్ప’తో తెలుగులోకి తొలి అడుగు వేయనున్నారు. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ఇందులో అక్షయ్‌ శివుడిగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఈరోజు కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఈ చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నారు. ఆ ప్రచార చిత్రంలో అక్షయ్‌ పాత్రను కూడా పరిచయం చేసే అవకాశమున్నట్లు తెలిసింది. ఇక దీంట్లో ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్‌ తదితరులు కూడా అతిథి పాత్రల్లో తళుక్కున మెరవనున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని