Amigos ott date: ఓటీటీలో కల్యాణ్‌రామ్‌ ‘అమిగోస్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రలో రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ‘అమిగోస్‌’ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 04 Mar 2023 14:43 IST

హైదరాబాద్‌: కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) ట్రిపుల్‌ రోల్‌లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అమిగోస్‌’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే, ప్రతినాయకుడి పాత్రలో కల్యాణ్‌రామ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ‘అమిగోస్‌’ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రం ఏప్రిల్‌ 1వ (amigos ott release date) తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు చేయనున్నారు. రాజేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘అమిగోస్‌’లో అషికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథేంటంటే: సిద్ధార్థ్‌ (కల్యాణ్‌రామ్‌) ది హైదరాబాద్‌. తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటుంటాడు. రేడియో జాకీగా పని చేసే ఇషికా (ఆషికా రంగనాథ్‌)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాడు. కానీ, ఆ వ్యవహారం బెడిసి కొడుతుంది. అదే సమయంలో సిద్ధార్థ్‌ ఓ వెబ్‌సైట్‌ వల్ల తనలాగే ఉండే మంజునాథ్, మైఖేల్‌ను కలుసుకుంటాడు. ఒకలాగే ఉన్న ఆ ముగ్గురు చాలా దగ్గరవుతారు. మంజు, మైఖేల్‌ సాయంతో సిద్ధార్థ్‌ తన ప్రేమను పెళ్లి పట్టాలెక్కిస్తాడు. ఆ తర్వాత సొంత ఊరు బెంగళూరుకు వెళ్లడానికి మంజునాథ్, కోల్‌కతాకు వెళ్లడానికి మైఖేల్‌ పయనమవుతారు. కానీ, ఇంతలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులు మంజునాథ్‌పై కాల్పులు జరిపి.. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్‌కు మైఖేల్‌ గురించి  ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. మైఖేల్‌ నరరూప రాక్షసుడని, అసలు పేరు బిపిన్‌ రాయ్‌ అని.. అతడిని పట్టుకోవడం కోసమే ఎన్‌ఐఏ వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారని సిద్ధార్థ్‌ తెలుసుకుంటాడు. బిపిన్‌ చేసిన మోసం వల్ల మంజు, తాను సమస్యల్లో చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. మరి బిపిన్‌ రాయ్‌ ఎవరు? అతడు మిగతా ఇద్దరి జీవితాల్లోకి రావడానికి కారణమేంటి? అతడు వేసిన ప్లాన్‌ నుంచి వీరిద్దరూ ఎలా తప్పించుకున్నారు? ఎన్‌ఐఏకు బిపిన్‌ను పట్టించారా? లేదా? అన్నది మిగతా కథ.

‘అమిగోస్‌’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని