Rules Ranjann ott: ఓటీటీలో కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన ‘రూల్స్‌ రంజన్‌’ మూవీ ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Updated : 29 Nov 2023 19:44 IST

హైదరాబాద్: కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. (Rules Ranjann) రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించారు. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.  వెన్నెల కిషోర్‌, ఆది కామెడీ మాత్రమే సినిమాను కాస్త నిలబెట్టాయి. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికగా ఆహాలో నవంబరు 30 సాయంత్రం 6గంటల నుంచి ‘రూల్స్‌ రంజన్‌’ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ వేదిక తెలిపింది.

కథేంటంటే: తిరుపతికి చెందిన మధ్యతరగతి కుర్రాడు మనో రంజన్‌ (కిరణ్‌ అబ్బవరం). తను చదువులో యావరేజ్‌ అయినా కష్టపడి క్యాంపస్‌ సెలక్షన్‌లో ఉద్యోగం సంపాదిస్తాడు. దాని కోసం ముంబయికి మకాం మారుస్తాడు. అయితే అతనికి హిందీ రాకపోవడం వల్ల ఆరంభంలో ఆఫీస్‌లో కొన్ని అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ సమస్యకు అలెక్సాతో చెక్‌ పెడతాడు. తన ప్రతిభతో బాస్‌ను మెప్పించి.. టీమ్‌ లీడర్‌గా ఎదుగుతాడు. అక్కడి నుంచి ఆఫీస్‌లోని ఉద్యోగులంతా తన రూల్స్‌ ప్రకారం నడిచేలా కట్టుదిట్టం చేస్తాడు. దీంతో వాళ్లంతా అతన్ని రూల్స్‌ రంజన్‌ అని పిలవడం మొదలు పెడతారు. అయితే ఒంటరిగా సాగిపోతున్న రంజన్‌ జీవితం సనా (నేహాశెట్టి) రాకతో మరో మలుపు తిరుగుతుంది. ఆమెను కాలేజీ రోజుల్లోనే రంజన్‌ గాఢంగా ప్రేమిస్తాడు. కానీ, భయంతో ఆ ప్రేమను ఏనాడూ బయట పెట్టడు. చాలా ఏళ్ల తర్వాత ముంబయిలో సనాని కలుసుకున్నాక రంజన్‌ తన మనసులోని ఇష్టాన్ని ఆమెకు తెలియజేస్తాడు. ఇద్దరూ కలిసి ఒకరోజంతా సరదాగా గడుపుతారు. ఈ క్రమంలో ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆమె దూరమవడంతో తనని వెతుక్కుంటూ తిరుపతికి వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆమెను పెళ్లి చేసుకునేందుకు రంజన్‌ వేసిన ఎత్తులేంటి?  ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఈ కథలో కామేశ్‌ (వెన్నెల కిషోర్‌), సనా అన్న (సుబ్బరాజు)ల పాత్రలేంటి? రంజన్‌ పెళ్లి చెడగొట్టాలని అతని స్నేహితులు ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్‌ ఎందుకు ప్రయత్నించారు? అన్నది మిగతా కథ.

రూల్స్‌ రంజన్‌ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని