బ్యాలెన్స్‌ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి

నటి పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్‌మీడియా వేదికగా పెట్టిన పోస్టు సరైన నిర్ణయం కాదని నిర్మాతల మండలి పేర్కొంది.

Updated : 21 May 2024 00:28 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమ నుంచి తనని బ్యాన్‌ చేయాలని చూస్తున్నారని నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) సోషల్‌మీడియా వేదికగా పోస్టు పెట్టడాన్ని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఖండించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ప్రదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించిన ‘రక్షణ’ చిత్రాన్ని ఏప్రిల్‌ 19న విడుదల చేయాలని భావించారు. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు పాయల్‌ రాజ్‌పుత్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. ‘నాలుగేళ్ల కిందటి సినిమా. ఇప్పుడు దానికి నేను ప్రమోషన్‌ చేయలేను. కావాలంటే ఓటీటీలో విడుదల చేసుకోండి’ అంటూ సలహా ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. సినిమా కోసం 50 రోజులు డేట్స్‌ ఇవ్వడంతో పాటు, ప్రమోషన్స్‌లోనూ పాల్గొనాలి. ఆమె 47 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కొవిడ్‌, ఇతర ఆర్థిక సమస్యల కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి, ఆమెను ప్రచారానికి పిలిస్తే సరైన స్పందన లేదు. సినిమా విడుదలకు ఆమెకు ఇవ్వాల్సిన మిగిలిన పారితోషికం రూ.6 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను కూడా డిపాజిట్ చేశారు. అయినా కూడా పాయల్‌ ముందుకురాలేదు’’

‘‘ఇలా చేయడం వల్ల ప్రదీప్‌ ఠాకూర్‌ సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాం. పాయల్‌ అందులో సభ్యురాలు కాకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తే, పాయల్‌ మేనేజర్‌ను పిలిచి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దీంతో పాయల్‌ ప్రమోషన్స్‌కు వస్తుందని మొదట చెప్పి, ఆ తర్వాత మాట మార్చారు.   ఈ విషయమై పదేపదే ఆయనతో మాట్లాడినా సరైన స్పందన లేదు. ఈ నేపథ్యంలో పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్డడం సరైంది కాదు. దీన్ని తెలుగు చలన నిర్మాతల మండలి ఖండిస్తోంది. గత నెలన్నర రోజులుగా పాయల్‌ రాజ్‌పుత్‌, ఆమె టీమ్‌తో చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించడానికి నిర్మాతల మండలి ఎప్పుడూ ముందుంటుంది’’ అని ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని