Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే

‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్‌’ విడుదలైంది.

Updated : 29 Mar 2024 11:48 IST

‘లెజెండ్‌’ పదేళ్ల వేడుకలో కథానాయకుడు బాలకృష్ణ

‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్‌’ విడుదలైంది. ఆ ప్రభావం అప్పటి ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. మళ్లీ ఈసారి ఎన్నికలకు ముందు రీరిలీజ్‌గా అదే చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాటి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈసారీ జయం మనదే’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్‌’ విడుదలై గురువారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న చిత్రాన్ని రీరిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకని నిర్వహించారు. చిత్రబృందానికి పదేళ్ల జ్ఞాపికని అందజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘రికార్డులు నాకు కొత్త కాదు. సృష్టించాలన్నా నేనే, తిరగరాయాలన్నా నేనే. కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతుంటాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ అలాంటివే. 1116 రోజులు, నాలుగు ఆటలు ఆడి మరో కొత్త రికార్డుని దాటిన దక్షిణాది సినిమా నా ‘లెజెండ్‌’. ఈ మధ్య చేసిన ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’ తదితర చిత్రాలు కూడా నాలో కసిని పెంచాయి. ఇలాంటి మంచి సినిమాలు ఇస్తే మరిన్ని చేయండని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు ప్రేక్షకులు. మహిళల గురించి గొప్ప సందేశాన్నిచ్చిన సినిమాలు చేసే అదృష్టం నాకు కలిగింది. ‘లెజెండ్‌’లో మహిళల గురించి గొప్ప సందేశం ఉంది. సినిమా మాధ్యమం ప్రభావం ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల్లోనూ చూస్తారు. ఈ వేడుకకి పసుపు దుస్తుల్లో వచ్చారు కథానాయిక సోనాల్‌ చౌహాన్‌. పసుపు అభివృద్ధికి నిదర్శనం. పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం. పసుపు ఆత్మగౌరవ పతాకం.

నేను, బోయపాటి శ్రీను కలిసి చేసిన ప్రతి సినిమాలోనూ జరగబోయేది ఏమిటో చెప్పాం. అదే నిజమైంది. ‘లెజెండ్‌’తోపాటు, ఇటీవల ‘అఖండ’లో కూడా చెప్పాం. అదే నిజం కాబోతోంది. నేనూ, బోయపాటి శ్రీను మాటలతో కాకుండా చేసి చూపిస్తుంటాం. ‘లెజెండ్‌’ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులు గొప్ప సహకారం అందించారు. అందరికీ ధన్యవాదాలు. నా మనవళ్ల తరంతోనూ కనెక్ట్‌ అయ్యేలా చేసింది సినిమా. నటుడిగానే కాకుండా, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌గా నిజజీవితంలోనూ పలు పాత్రల్ని పోషిస్తూ న్యాయం చేకూరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాకు సహకరిస్తూ, నా అభిమానులూ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ జన్మకిది చాలు. ఈ ప్రోత్సాహం, అనుబంధం అన్ని రంగాల్లో కొనసాగాలని ఆశిస్తున్నా’’ అన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకి కృతజ్ఞతలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌కు సినిమాని అంకితమిస్తూ ‘లెజెండ్‌’ని మొదలుపెట్టాం. ఆయన ఆశీసులతోనే పదేళ్లయినా ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఒక లెజెండరీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నా. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల’’ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్‌ ఆచంట, సోనాల్‌ చౌహాన్‌, గోపీ ఆచంట, ఇతర చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని