Salaar release date: ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌.. తాజా పరిస్థితి ఇదే.. మీమ్స్‌ వైరల్‌!

Salaar release date: ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’(Salaar). ఈ సినిమా విడుదల వాయిదా వార్తల నేపథ్యంలో అనేక సినిమాల రిలీజ్‌ డేట్స్‌పై ప్రభావం పడనుంది.

Updated : 04 Sep 2023 17:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ‘సింపుల్‌ ఇంగ్లీష్‌..’ అంటూ మొదలు పెట్టి ప్రభాస్‌ను డైనోసార్‌గా పోలుస్తూ  విడుదల చేసిన ‘సలార్‌’ గ్లింప్స్‌ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. విదేశాల్లో టికెట్‌ బుకింగ్స్‌ కూడా అయిపోయాయి. సెప్టెంబరు 28వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులను ‘సలార్‌ వాయిదా’ అంటూ  సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ (Salaar: Part 1 Ceasefire) సెప్టెంబరు 28న కాకుండా నవంబరులో వస్తే, చాలా సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని, సినీ వర్గాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా తమిళనాడు, కేరళలో విడుదలయ్యే అనేక సినిమాలు వాయిదా పడక తప్పదు.

ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ‘సలార్‌’ విడుదలైతే బాక్సాఫీస్‌ కళకళలాడేది.  షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ సెప్టెంబరు 7న రాబోతోంది. అంటే ఈ సినిమా విడుదలైన మూడు వారాలకు ‘సలార్‌’ విడుదల కావాలి. అలా జరిగి ఉంటే, గత నెల మాదిరిగానే (‘జైలర్‌’, ‘గదర్2’) ఈ నెల  కూడా కాసుల వర్షం కురిసేది. ఇప్పుడు ‘సలార్‌’ను నవంబరు 24వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌. అలా జరిగితే అప్పటికే షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకున్న అనేక సినిమాలు తమ విడుదల తేదీని మార్చుకోక తప్పదు. మరీ ముఖ్యంగా ఈ దీపావళికి సల్మాన్‌ ‘టైగర్‌3’ రాబోతోంది. తమిళంలో ‘అయలాన్‌’, ‘జపాన్‌’, ‘జిగర్తాండ2’ రాబోతున్నాయి. ఇప్పుడు వీటి విడుదల ప్రశ్నార్థకంగా మారుతుంది.

మరోవైపు ‘సలార్‌’ను నిర్మిస్తున్న హోంబాలే ఫిల్మ్‌ మాత్రం ఇప్పటివరకూ నోరు విప్పలేదు. తమ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ‘సలార్‌’ విడుదల తేదీ సెప్టెంబరు 28నే అని ఉంచారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. ‘సలార్‌’ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ సంతోషంగా లేరని టాక్‌. ఎడిటింగ్‌ టేబుల్‌ ముందు కూర్చొన్న ఆయన అనుకున్న విధంగా కొన్ని షాట్స్‌ రాలేదట. దీంతో వాటిని మళ్లీ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు పంపారట. దీంతో సినిమా విడుదల వాయిదా అన్న టాక్‌ బయటకు వచ్చింది. ‘అంత భారీ స్థాయిలో సినిమాను నిర్మిస్తున్నప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్లు సినిమాను కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విడుదల చేస్తున్నారు. అక్కడి సెన్సార్‌కు తగినట్లుగా అన్నీ ఉండాలి. సీజీఏ వర్క్‌ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన సినిమాల విషయంలో ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలన్నది ప్రశాంత్‌ నీల్‌ ఆలోచన. అందుకు సినిమా విడుదల ఆలస్యమైనా వెనక్కి తగ్గేదిలేదంటున్నారు’ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు ‘సలార్‌’ విడుదల వాయిదా అని వార్తలు రావడంతో పలు చిత్రాలు ఆ తేదీలో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కిరణ్ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ను సెప్టెంబరు 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అక్టోబరు 20న విడుదల కావాల్సి ఉండగా, దాన్ని ముందుకు  తీసుకురాబోతున్నారని టాక్‌. ఇక ‘సలార్‌’ విడుదల వాయిదా వార్తల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని