Cinema News: భయపెట్టే శబ్దం

ఆది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ‘వైశాలి’ విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. 7జి శివ నిర్మాత.

Updated : 13 Apr 2024 11:55 IST

ది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ‘వైశాలి’ విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. 7జి శివ నిర్మాత. సిమ్రాన్‌, లైలా, లక్ష్మీ మేనన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో వెంకటేశ్‌ శుక్రవారం విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రం ఆద్యంతం చిత్ర విచిత్రమైన శబ్దాల చుట్టూ తిరిగింది. ఓ పాడుబడ్డ భవనం వద్ద కొన్ని వింత సంఘటనలు జరిగేటప్పుడు ఆది పినిశెట్టి దాని తాలూకూ కొన్ని చిత్రమైన శబ్దాలను రికార్డు చేస్తూ ఎంట్రీ ఇవ్వడం.. ఓ పాప ఎత్తైన భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం.. కొన్ని భయానక శబ్దాలు కొందరు వ్యక్తుల్ని చిత్రవధ చేయడం.. ఆఖర్లో స్ట్రెచ్చర్‌పై ఉన్న చిత్రమైన రూపమున్న జీవి ఉలిక్కిపడేలా చేయడం.. ఇలా టీజర్‌ ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ సాగింది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇదొక వినూత్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకి తమన్‌ సంగీతమందిస్తున్నారు.


రాజ్‌ తరుణ్‌ క్రైమ్‌ కామెడీ

రాజ్‌ తరుణ్‌ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. మురళీధర్‌ రెడ్డి, కేఐటీఎన్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో రమేష్‌ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీ సింగ్‌ కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మారుతి క్లాప్‌ కొట్టగా..  ప్రవీణ్‌ సత్తారు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నక్కిన త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా మంచి కథ. నాకెంతో ఇష్టమైన క్రైమ్‌ కామెడీ జానర్‌లో సాగుతుంది. ఈ నెల 15నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణని ప్రారంభిస్తున్నాం’’ అన్నారు.


విభిన్నం.. సందేశం

ణేశ్‌, ఆయుషి పటేల్‌ జంటగా ప్రవీణ్‌ జెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్లు కాంపౌండ్‌ 1995’. బుర్రా మల్లేశ్‌ గౌడ్‌, హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘పేరు బాగుంది. కల్లు కాంపౌండ్‌ వేదికగా చాలా పనులు జరుగుతుంటాయి. ఓ యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని తీశారు. నటులకి, సాంకేతిక బృందానికి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథతో, బలమైన సందేశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రమిది’’ అన్నారు. కథానాయకుడు గణేశ్‌ మాట్లాడుతూ ‘‘కథ పాత్రలకి తగ్గట్టుగా ఉన్నానని నమ్మి ఎలాంటి ఆడిషన్స్‌ లేకుండా నాతో సినిమా చేశారు దర్శకనిర్మాతలు. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రాంకీ, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ప్రశాంత్‌ గౌడ్‌, విజయకాంత్‌, శ్రవణ్‌కుమార్‌ కొమ్మారెడ్డి, నటుడు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


‘డీఎన్‌ఏ’లో సవాల్‌ విసిరే పాత్ర

‘లక్కీ లక్కీ రాయ్‌’, ‘రత్తాలు రత్తాలు’ లాంటి ప్రత్యేక పాటలతో కుర్రకారుని ఉర్రూతలూగించింది నాయిక లక్ష్మీ రాయ్‌. ఇప్పుడామె ఓ భిన్నమైన కథతో ప్రేక్షకుల్ని పలకరించడానికి ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డీఎన్‌ఏ’. టీఎస్‌ సురేశ్‌ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హనీ రోజ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ.. ఇందులోని తన ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది లక్ష్మీ రాయ్‌. ఇందులో పోలీసు అధికారిగా సరికొత్తగా కనిపిస్తూ సినీప్రియుల్ని ఆకట్టుకుంటోందామె. ‘‘నా తదుపరి మలయాళీ చిత్రం ‘డీఎన్‌ఏ’. ఇందులో ఏపీఎస్‌ రాచెల్‌ అనే సవాల్‌ విసిరే పాత్రలో కనిపించనున్నాను. త్వరలో ట్రైలర్‌ విడుదల కానుంద’’ని వ్యాఖ్యల్ని జోడించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం.


అపహరణల పర్వం

‘పారిజాత పర్వం’తో థియేటర్లలో నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు చైతన్య రావు, సునీల్‌. వీళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించారు. మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ సంయుక్తంగా నిర్మించారు. శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ కథానాయికలు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే యాంకర్‌ సుమ కనకాల ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘కేక్‌ కట్‌ చేసేటప్పుడు లైట్స్‌ ఆర్పుతారట. మళ్లీ లైట్స్‌ వేసే లోపు కేక్‌తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’’ అంటూ కిడ్నాపర్‌గా సునీల్‌ తన గ్యాంగ్‌తో చెప్తున్న డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌’.. అన్న ఉపశీర్షికకు న్యాయం చేసేలా ఇందులో కిడ్నాప్‌ డ్రామాను వినోదభరితంగా తీర్చిదిద్దారు. చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రల చుట్టూ నడిపిన కిడ్నాప్‌ తతంగమంతా ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఇక ఆఖర్లో వైవా హర్ష మీడియా ముందు బిగ్గరగా అరుస్తూ సినిమా రివ్యూ చెప్పిన తీరు నవ్వులు పూయించింది. ఈ చిత్రానికి సంగీతం: రీ, ఛాయాగ్రహణం: బాల సరస్వతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు