Tollywood: కన్నప్ప మొదలైంది

కథానాయకుడు మంచు విష్ణు కలల సినిమాల్లో... ‘కన్నప్ప’ ఒకటి. చాలా రోజులుగా ఆయన ఈ సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. భక్త కన్నప్ప కథతో రూపొందనున్న ఈ చిత్రానికి శుక్రవారం శ్రీకాళహస్తిలో శ్రీకారం చుట్టారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

Updated : 19 Aug 2023 14:08 IST

థానాయకుడు మంచు విష్ణు కలల సినిమాల్లో... ‘కన్నప్ప’ ఒకటి. చాలా రోజులుగా ఆయన ఈ సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. భక్త కన్నప్ప కథతో రూపొందనున్న ఈ చిత్రానికి శుక్రవారం శ్రీకాళహస్తిలో శ్రీకారం చుట్టారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోలా ఆనంద్‌ చేతుల మీదుగా స్క్రిప్ట్‌, క్లాప్‌బోర్డులను మోహన్‌బాబు అందుకుని తొలి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా, ప్రముఖ నటి కృతిసనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ కథానాయికగా నటిస్తున్నారు. స్టార్‌ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై  మోహన్‌బాబు, మంచు విష్ణు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ‘‘మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ‘కన్నప్ప’ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో చలనచిత్రం తీయడం వీలుకాదు. అందుకోసం ఈ చిత్ర నిర్మాణానికి ఆర్నెల్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం.

కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నాం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకి కీలకమైన మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తారు. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం. భారతీయ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం అవుతారు. త్వరలోనే మరిన్ని విశేషాల్ని వెల్లడిస్తామ’’ని మంచు విష్ణు తెలిపారు.

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి


స్వయంభూ ప్రారంభం

శ్రావణ శుక్రవారం సందర్భంగా చిత్రసీమలో కొన్ని కొత్త చిత్రాలు శ్రీకారం చుట్టుకున్నాయి. అందులో ‘స్వయంభూ’ ఒకటి. నిఖిల్‌ కథానాయకుడిగా పిక్సెల్‌ స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. సంయుక్త మేనన్‌ కథానాయిక. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భువన్‌, శ్రీకర్‌ నిర్మాతలు. ఠాగూర్‌ మధు సమర్పిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నిచ్చారు. మరో నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. అభిషేక్‌ అగర్వాల్‌, సూర్యదేవర నాగవంశీ, దామోదర్‌ ప్రసాద్‌ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.    ‘‘నిఖిల్‌ కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి 20వ చిత్రమిది. ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ఆయన మునుపెన్నడూ చేయని పాత్రని ఇందులో చేస్తున్నారు. ప్రచార చిత్రంలో కనిపిస్తున్నట్టుగా ఓ యోధుడిగా శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది. రెగ్యులర్‌ చిత్రీకరణ కూడా శుక్రవారం నుంచే మొదలైంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎం.ప్రభాకరన్‌, సంభాషణలు: వాసుదేవ్‌ మునెప్పగారి.


సుహాస్‌.. కేబుల్‌ రెడ్డి

ఫ్యాన్‌ మేడ్‌ ఫిలింస్‌ పతాకంపై సుహాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కేబుల్‌ రెడ్డి’. షాలిని కొండేపూడి కథానాయిక. శ్రీధర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు శైలేష్‌ కొలను క్లాప్‌నిచ్చి, స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందజేశారు. అనంతరం కథానాయకుడు సుహాస్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు శ్రీధర్‌ నాకు మంచి స్నేహితుడు. తను చెప్పిన కథ చాలా బాగుంది. పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రం. రెండు రోజుల్లో చిత్రీకరణ మొదలవుతుంది’’ అన్నారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి సినిమా. ఒక టౌన్‌లో జరిగే కథతో స్వచ్ఛమైన వినోదంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో... పక్కా ప్రణాళికతో చిత్రీకరణకి వెళుతున్నాం. తొలి షెడ్యూల్‌ని 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాత బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌ సాయి, కళ: క్రాంతి ప్రియం, ఛాయాగ్రహణం: మహిరెడ్డి పండుగల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని