Lover: హీరోయిన్‌ స్నేహితురాలిగా యాక్ట్‌ చేసి.. ట్రోల్స్ ఎదుర్కొంటోన్న నటి

మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover)

Published : 11 Apr 2024 13:43 IST

చెన్నై: ‘గుడ్‌నైట్’ ఫేమ్‌ మణికందన్‌, నటి గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover). ప్ర‌భురామ్ వ్యాస్‌ దర్శకుడు. ప్రస్తుతం డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా నటించారు హరిణి సౌందర రాజన్‌. సినిమాలో కీలకంగా ఉండే ఐషూ పాత్రలో ఆమె కనిపించారు. ఆ పాత్ర నచ్చకపోవడంతో పలువురు నెటిజన్లు.. సోషల్‌మీడియాలో హరిణిని టార్గెట్‌ చేస్తూ అసభ్యకరంగా సందేశాలు పంపించారు. ఈ వ్యవహారంపై ఆమె తాజాగా స్పందించారు.

‘‘ట్రూ లవర్‌’లో నేను పోషించిన ఐషూ పాత్ర నచ్చకపోవడంతో నన్ను తిడుతూ పలువురు నెటిజన్లు సందేశాలు పంపుతున్నారు. నటీనటులు పోషించిన పాత్రలు నచ్చకపోతే వారిని వ్యక్తిగతంగా దూషించినా ఫర్వాలేదని కొంతమంది భావిస్తుంటారు. ఇలాంటి దురుసు ప్రవర్తన వల్లే ఎంతోమంది ఐషూలుగా మారతారని వీరికి అర్థం కావడం లేదా? మీకు ఒకవేళ పాత్ర నచ్చకపోతే అగౌవరంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

కథేంటంటే: అరుణ్ (మ‌ణికంద‌న్‌), దివ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ‌లో ఉంటారు. దివ్య కాలేజీ పూర్తి కాగానే ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. అరుణ్ మాత్రం కేఫ్ పెట్టాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తూ ఖాళీగా తిరుగుతాడు. అతడికి త‌న ప్రేమ విష‌యంలో అభ‌ద్ర‌తా భావం ఎక్కువ‌. ఈ కార‌ణంగా దివ్య‌పై త‌ర‌చూ అనుమాన ప‌డుతుంటాడు. ఆమె తోటి అబ్బాయిల‌తో మాట్లాడినా.. చెప్ప‌కుండా ఎక్క‌డికి వెళ్లినా అస‌లు సహించ‌డు. ప్ర‌తి విష‌యంలోనూ ఆమెను నియంత్రించాల‌ని చూస్తుంటాడు. అరుణ్ ప్ర‌వ‌ర్త‌నతో విసిగిపోయిన దివ్య ఓ ద‌శ‌లో అత‌ని నుంచి పూర్తిగా దూరం కావాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. అలా కొన్నాళ్లు ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లుండ‌వు. ఆ త‌ర్వాత ఆమె పుట్టిన‌రోజు పార్టీకి ఆహ్వానించ‌గా.. అక్క‌డ మ‌ళ్లీ పెద్ద గొడ‌వ అవుతుంది. దీంతో ఇద్ద‌రూ మ‌ళ్లీ విడిపోతారు. ఆ త‌ర్వాత దివ్య త‌న ఆఫీస్ ఫ్రెండ్స్‌తో క‌లిసి ట్రిప్‌కు వెళ్తుంది. అది తెలిసి అక్క‌డికి అరుణ్ కూడా వెళ్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? వీళ్లిద్దరు మ‌ళ్లీ క‌లిశారా? విడిపోయారా? అరుణ్ వాళ్ల అమ్మ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అత‌డు కేఫ్ పెట్టాల‌న్న ల‌క్ష్యం నెర‌వేరిందా? లేదా? అన్న ఆసక్తికర విషయాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు