Upasana: ‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో

నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్‌ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు.

Published : 21 Apr 2024 00:13 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించారు. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా, ఇంటి రుచులకు అనుగుణంగా, నాణ్యమైన డ్రై హోమ్‌ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు.

దీనికి సంబంధించిన ఓ సరదా వీడియోను ఉపాసన తాజాగా నెట్టింట షేర్‌ చేశారు. అంజనా దేవి పర్యవేక్షణలో సురేఖ పచ్చడి కలుపుతూ కనిపించారు. ‘‘(అంజనాదేవిని ఉద్దేశించి) నానమ్మా.. ఏంటి కోపంగా ఉన్నారు. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయడం లేదా?’’ అని ఉపాసన అడగ్గా.. అలా ఏమీ లేదని అంజనాదేవి నవ్వుతూ బదులిచ్చారు. ‘‘లివింగ్‌ రూమ్‌ కిచెన్‌గా మారితే ఇలా ఉంటుంది..! అంజనాదేవి పర్యవేక్షణలో కొత్త ఆవకాయ సిద్ధం చేస్తున్నాం. మీరు కూడా అత్తమ్మాస్‌ కిచెన్‌ ఆవకాయ్‌ రుచి చూడాలనుకుంటున్నారా?’’ అని పేర్కొన్నారు.

ఆరు పదుల వయసులో సురేఖ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడంపై ఉపాసన ఇటీవల స్పందించారు. ‘‘ఈ వయసులో తన అభిరుచిని నెరవేర్చుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మీ స్ఫూర్తికి సలామ్‌. ఇలాంటి అమ్మలు, అత్తమ్మలు ముందుకొచ్చి తమకు నచ్చిన వ్యాపారాలు ప్రారంభిస్తే మన దేశం ఆర్థికంగా ఎంతగా అభివృద్ధి సాధిస్తుందో ఒక్కసారి ఊహించండి. తమ అభిరుచుల్ని ఆచరణలో పెడుతూ మరింతమంది మహిళలు వృత్తి ఉద్యోగాల్లో రాణించాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు