Sankranti 2024 Movies: ఈ సంక్రాంతికి థియేటర్‌లో సందడి చేసే చిత్రాలివే.. మరి ఓటీటీలో...?

సంక్రాంతికి తెలుగు లోగిళ్లు ఎంత కళకళలాడతాయో.. కొత్త సినిమాలతో థియేటర్‌లు అంతే సందడిగా మారతాయి. ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో చదివేయండి..

Updated : 08 Jan 2024 10:12 IST

ముచ్చటగా మూడోసారి..

మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు.


తెలుగు తెర సూపర్‌హీరో హను-మాన్‌

వైవిధ్యమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్‌ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. సామాన్యుడు అసమాన్యమైన శక్తులను పొంది, చెడుపై ఎలా విజయం సాధించాడనేది చిత్ర కథ. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ అంచనాలు పెంచేలా చేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. నిరంజన్‌రెడ్డి నిర్మాత.


గ్రహంతరవాసి కథతో..

సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఒకట్రెండు డబ్బింగ్‌ చిత్రాలు కూడా ఇక్కడి ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈసారి తమిళ చిత్రం ‘అయలాన్‌’తో (Ayalaan) శివకార్తికేయన్‌ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఇది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. వాతావరణ మార్పుల వల్ల భూమికి వచ్చే ఆపద ఏంటి? అందుకు కారణం ఎవరు? అనుకోకుండా గ్రహాంతరవాసి భూమిపైకి ఎందుకు వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


యాక్షన్‌ థ్రిల్లర్‌తో వెంకీమామ

కుటుంబ ప్రేక్షకులకు అత్యంత చేరువైన నటుడు వెంకటేశ్‌ (Venkatesh). గత చిత్రాలకు భిన్నంగా శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav). వెంకటేశ్‌ 75వ సినిమాగా రూపొందిన ఈ చిత్రం జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత.


ఫ్యామిలీ డ్రామా విత్‌ యాక్షన్‌

ఈ సంక్రాంతికి మరో అగ్రకథానాయకుడు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్‌ కథానాయిక. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తీర్చిదిద్దారు.  ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

  • నెట్‌ఫ్లిక్స్‌
  • బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌2) జనవరి 10
  • కింగ్‌ డమ్‌-3 (జపనీస్‌) జనవరి 10
  • ది ట్రస్ట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 10
  • బాయ్‌ స్వాలోస్‌ యూనివర్స్‌(వెబ్‌సిరీస్‌)జనవరి 10
  • కిల్లర్‌ సూప్‌ (హిందీ) జనవరి 11
  • ఛాంపియన్‌ (వెబ్‌సిరీస్‌)
  • లిఫ్ట్‌ (హాలీవుడ్‌) జనవరి 12
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ఎకో (వెబ్‌సిరీస్‌) జనవరి 11
  • ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ (యానిమేషన్‌ సిరీస్‌) జనవరి 12
  • సోనీలివ్‌
  • జర్నీ (తమిళ చిత్రం) జనవరి 12
  • ఆహా
  • కోట బొమ్మాళి పి.ఎస్‌. (తెలుగు) జనవరి11
  • సేవప్పి (తమిళ) జనవరి 12
  • బుక్‌ మై షో
  • వన్‌ మోర్‌ షాట్‌ (హాలీవుడ్‌) జనవరి 9
  • జియో సినిమా
  • ల బ్రియా (వెబ్‌సిరీస్‌) జనవరి 10
  • టెడ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకనింగ్‌ (హాలీవుడ్‌) జనవరి 11
  • రోల్‌ప్లే (హలీవుడ్‌) జనవరి 12
  • ఆపిల్‌ టీవీ ప్లస్‌
  • క్రిమినల్‌ రికార్డ్‌ (వెబ్ సిరీస్‌) జనవరి 10
  • కిల్లర్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌ (హాలీవుడ్‌) జనవరి 12
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని