Upcoming movies: ఈ క్రిస్మస్‌కు బాక్సాఫీస్‌ దద్దరిల్లే చిత్రాలు.. ఒకరు హిట్‌ కోసం.. మరొకరు హ్యాట్రిక్‌ కోసం..

2023 క్రిస్మస్‌ వినోదాల విందును రెట్టింపు చేయనుంది. బాక్సాఫీస్‌ వద్ద అగ్ర కథానాయకుల చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. మరి అవేంటో చూసేయండి

Published : 18 Dec 2023 09:47 IST

స్నేహితులు శత్రువులైతే..

ఎప్పుడెప్పుడా అని సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ప్రభాస్‌ (Prabhas) ‘సలార్‌’ (Salaar) ఒకటి.  ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం తొలి భాగం సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌  డిసెంబరు 22న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో భారతీయ సినీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఈసారి ప్రభాస్‌ కటౌట్‌కు సరిపోయే కథతో వస్తున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ ‘సలార్‌’ను నిర్మించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ స్థాయికి తగిన విజయం ఒక్కటీ దక్కలేదు. ఈ ఏడాది ‘ఆదిపురుష్‌’తో పూర్తిగా నిరాశపరిచారు. ఇప్పుడు ‘సలార్‌’పైనే ఆశలన్నీ..


భావోద్వేగాల ప్రయాణం ‘డంకీ’

సామాజిక అంశాలే ఇతివృత్తంగా మనసుకు హత్తుకునేలా చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణి. ఆయన దర్శకత్వంలో  బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’ (Dunki).  ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సీ నటిస్తోంది. క్రిస్మస్‌ కానుకగా 2023 డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేసే ప్రయాణం’ అంటూ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రయాణంలో ఆ  సైనికుడి స్నేహితులకు వచ్చిన ఆపద ఏంటి? దాన్ని నుంచి వాళ్లను ఎలా బయటపడేశాడు అన్నది తెలియాలంటే డంకీ చూడాల్సిందే. ఈ ఏడాది షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ ఘన విజయాలను నమోదు చేశారు. ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు.


తొలి భాగాన్ని మించేలా..

జాసన్‌ మోమోవా కథానాయకుడిగా జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘ఆక్వామెన్‌’. 2018లో విడుదలై బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌’ (Aquaman and the Lost Kingdom) ప్రేక్షకుల ముందుకు రానుంది. జాసన్‌ ఈ సీక్వెల్‌లోనూ ఆర్థర్‌ కర్రీ అనే పాత్రలోనే సందడి చేయనున్నారు. అట్లాంటిస్‌ రాజు అయిన తర్వాత ఆర్థర్‌జీవితం ఎలా మారింది? ‘మాంటా’ ఆర్థర్‌ కుటుంబాన్ని, అట్లాంటిస్‌పై పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు? ఈ క్రమంలో అత్యంత శక్తిమంతుడైన మాంటాను తన సోదరుడితో కలిసి ఆర్థర్‌ ఏవిధంగా అడ్డుకున్నాడన్నది తెలియాలంటే ‘ఆక్వామెన్‌2’ చూడాల్సిందే


ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే!

 • నెట్‌ఫ్లిక్స్‌
 • ది రోప్‌ కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 17
 • మేస్ట్రో (హాలీవుడ్‌) డిసెంబరు 20
 • ఆది కేశవ (తెలుగు) డిసెంబరు 22
 • టాప్‌గన్‌: మావెరిక్‌ (హాలీవుడ్) డిసెంబరు 22
 • కర్రీ అండ్‌ సైనైడ్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 22
 • రెబల్‌ మూన్‌ (హాలీవుడ్) డిసెంబరు 22
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • డ్రై డే (హిందీ) డిసెంబరు 22
 • సప్తసాగర దాచే ఎల్లో సైడ్‌:బి (కన్నడ) డిసెంబరు 22
 • జియో సినిమా
 • ది సావనీర్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17
 • హే కామిని (హిందీ) డిసెంబరు 22
 • లయన్స్‌ గేట్‌ ప్లే
 • ఫియర్‌ ది నైట్‌ (హాలీవుడ్) డిసెంబరు 22
 • బుక్‌ మై షో
 • ది మిరాకిల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 19
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని