Tollywood: ఏజెంట్స్‌.. ఆన్‌ డ్యూటీ

వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములాల్లో స్పై థ్రిల్లర్లకు ప్రత్యేకమైన స్థానముంది. గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ కథలపై ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే కథ, కథనాలు..

Updated : 31 Mar 2024 13:38 IST

వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములాల్లో స్పై థ్రిల్లర్లకు ప్రత్యేకమైన స్థానముంది. గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ కథలపై ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే కథ, కథనాలు.. బుర్రకు పదును పెట్టే చిక్కుముడులు.. ఆశ్చర్యపరిచే మలుపులు.. చూపు తిప్పుకోనివ్వని వీరోచిత పోరాటాలు.. దేశభక్తిని తట్టిలేపే హీరోయిజం.. ఇలా బోలెడన్ని వాణిజ్య హంగులకు నెలవున్న కథలివి. అందుకే స్పై కథలకు ప్రపంచవ్యాప్తంగా అంత గిరాకీ. ఇప్పుడిలాంటి థ్రిల్లింగ్‌ కథలతోనే ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు పలువురు కథానాయకులు సిద్ధమవుతున్నారు. మరి తెరపై గూఢచారులు, ఏజెంట్లుగా సందడి చేయనున్న ఆ తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ‘దేవర’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే తన తొలి బాలీవుడ్‌ చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు. అదే ‘వార్‌ 2’. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీంట్లో బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌తో పాటు తారక్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ భారత రా ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అంతేకాదు యశ్‌ స్పై యూనివర్స్‌లో ఈ పాత్ర తరచూ సందడి చేయనుందని.. పూర్తిగా ఆ పాత్ర నేపథ్యంలోనే సోలోగా ఓ సినిమా కూడా పట్టాలెక్కనుందని తెలిసింది. వచ్చే నెలాఖరు నుంచి ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్‌ సంగీతమందించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీస్టార్‌’గా సినీప్రియుల్ని పలకరించేందుకు బాక్సాఫీస్‌ బరిలో సిద్ధంగా ఉన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 5న థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత విజయ్‌.. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి సినిమాని పునఃప్రారంభించనున్నారు. ఇదీ ఓ ఆసక్తికర స్పై థ్రిల్లర్‌ కథాంశంతోనే ముస్తాబవుతోంది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం విజయ్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గోపీ 116 మళ్లీ వస్తున్నాడు..

ఇటీవల కాలంలో తెలుగులో గూఢచర్య నేపథ్య కథలకు మంచి ఊపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘గూఢచారి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ స్టైలిష్‌ స్పై థ్రిల్లర్‌ చిత్రంలో అర్జున్‌ కుమార్‌ అలియాస్‌ ఏజెంట్‌ గోపీ 116గా అడివి శేష్‌ చేసిన సాహసాలు సినీప్రియుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడదే పాత్రతో మరోసారి మురిపించేందుకు ‘గూఢచారి 2’తో సిద్ధమవుతున్నారు శేష్‌. అయితే తొలి భాగంలో కథంతా మన దేశం లోపల జరిగే ఆపరేషన్‌ చుట్టూ తిరగ్గా.. ఈ రెండో భాగంలో దేశం వెలుపల జరిగే ఓ సీక్రెట్‌ మిషన్‌ నేపథ్యంలో కథ సాగనుంది. అంతేకాదు దీంట్లో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హీరో నిఖిల్‌ చేయనున్న చిత్రాల్లో ‘ది ఇండియా హౌస్‌’ కూడా ఒకటి. కథానాయకుడు రామ్‌చరణ్‌ సమర్పిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నారు. భారతీయ చరిత్రలో మరచిపోయిన అధ్యాయంగా మిగిలిపోయిన ఓ ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. ఇదీ గూఢచర్య నేపథ్యమున్న కథాంశమే అని సమాచారం. దీంట్లో దేశభక్తి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలిసింది. స్వాతంత్య్రానికి పూర్వం లండన్‌లో జరిగే చిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం నిఖిల్‌ చేస్తున్న ‘స్వయంభూ’ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

స్పైగా సామ్‌ సాహసాలు..

ఓవైపు వెండితెరపై సినిమాలతో సందడి చేస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికగా వెబ్‌సిరీస్‌లతోనూ జోరు చూపిస్తోంది సమంత. ఆమె ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. దీంట్లో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. ఇదీ ఓ సరికొత్త స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతోనే రూపొందింది. దీంట్లో సామ్‌ - వరుణ్‌ స్పై ఏజెంట్స్‌గా వీరోచిత పోరాటాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సిరీస్‌ కోసం సమంత డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.

తమిళ సీమ నుంచి రానున్నాయి..

ఇటీవల కాలంలో తమిళ చిత్రసీమ నుంచి కూడా పలు స్పై థ్రిల్లర్లు ప్రేక్షకుల్ని మురిపించాయి. వాటిలో కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ ఒకటి. లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘విక్రమ్‌ 2’ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు లోకేశ్‌. అయితే ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కార్తి ‘సర్దార్‌’ కోసం భారత రా ఏజెంట్‌ పాత్రలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. పి.ఎస్‌.మిత్రన్‌ రూపొందించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సినీప్రియుల్ని మెప్పించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2’ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని