Varalaxmi sarathkumar: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నిశ్చితార్థం.. కాబోయే వరుడు ఎవరంటే?

Varalaxmi sarathkumar: సినీ నటి వరలక్ష్మి నిశ్చితార్థ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది.

Updated : 02 Mar 2024 20:02 IST

చెన్నై: సినీనటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. మార్చి1న ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. తమిళ, తెలుగు చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, పాత్రలతో అలరించారు. ఇక నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు.

నికోలయ్‌, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది. వీరి వివాహానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు వరలక్ష్మి అటు తమిళ, ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘హను-మాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాయన్‌’లోనూ  నటిస్తున్నారు. దీంతోపాటు, మలయాళంలో ‘కలర్స్‌’, తెలుగు ‘శబరి’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని