Varalaxmi Sarathkumar: తన చుట్టూ కథ నడిస్తే ఉత్సాహమే కదా!

తన బిడ్డని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందనే కథతో తెరకెక్కిన చిత్రమే మా ‘శబరి’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె ప్రధాన పాత్రధారిగా... అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. 

Updated : 13 Apr 2024 11:45 IST

న బిడ్డని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందనే కథతో తెరకెక్కిన చిత్రమే మా ‘శబరి’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె ప్రధాన పాత్రధారిగా... అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.  మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల సమర్పకులు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  ఐదు భాషల్లో ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానాయకుడు వరుణ్‌ సందేశ్‌ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘నా నట ప్రయాణంలో ప్రత్యేకమైనది ‘శబరి’.  తెలుగులో నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రమిదే. తన పాత్ర చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటికైనా ఉత్సాహాన్నిస్తుంది.  మంచి కథతో రూపొందిన చిత్రమిది. అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. చాలా రోజుల తర్వాత ఇందులో డ్యాన్స్‌ చేశా.  నేనీ సినిమాకి సంతకం చేసేటప్పటికి నాకు ఇన్ని విజయాలు లేవు. కానీ నన్ను, కథని నమ్మి రాజీపడకుండా సినిమా చేశారు నిర్మాత. అద్భుతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు అనిల్‌. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ‘హనుమాన్‌’ సినిమా అంత పెద్ద విజయం సాధించింటే కారణం తెలుగు ప్రేక్షకులే. నచ్చితే ‘శబరి’ని కూడా అదే స్థాయిలో ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. నిర్మాతకి విజయాలు వస్తే కొత్తవాళ్లకి అవకాశాలు ఇస్తార’’న్నారు.

వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘చాలా మంది దర్శకనిర్మాతలతో ప్రయాణం చేశా. కానీ నిర్మాత మహేంద్రతో ప్రయాణం గొప్పగా ఉంది. ఆయనతో నేనొక సినిమా చేస్తున్నా. ‘శబరి’ ట్రైలర్‌ చాలా బాగుంది. ఇదివరకు ‘మైఖేల్‌’ సినిమాలో నేను, వరలక్ష్మి నటించాం. మా మధ్యలో సన్నివేశాలు లేవు కానీ, భవిష్యత్తులో ఆమెతో కలిసి నటించాలని ఉంది.  ప్రేక్షకులంతా ఈ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తొలి సినిమానే వరలక్ష్మితో కలిసి చేయడం ఆనందంగా ఉంది. ఆమె నిర్మాత గురించి ఆలోచించే నటి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్‌దీప్‌, శశాంక్‌, ప్రభు, ఫణి, నాని చమిడిశెట్టి, ఆశిష్‌ తేజ్‌, మానస నున్న, రాజ్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని