Vidya Balan: ఆ ట్యాగ్‌ వల్లే 12 చిత్రాలు చేజారిపోయాయి.. వారి మాటలు ఎప్పటికీ మర్చిపోను: విద్యాబాలన్

‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాలతో తెలుగువారికి చేరువైన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ (Vidya Balan).

Published : 14 Apr 2024 18:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై నటి విద్యాబాలన్‌ (Vidya Balan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తొలినాళ్లలోనే స్టార్‌ హీరో చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని, అనుకోని కారణాలతో ఆయా చిత్రాలు కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ముఖ్యంగా మోహన్‌లాల్‌తో చేయాల్సిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో 12 చిత్రాలు చేజారిపోయాయని చెప్పారు.

‘‘కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. చాలా మంది నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ఏదో ఒక కారణం చెప్పి చివరకు నన్ను తొలగించేవారు. దాదాపు మూడేళ్లు ఈ పరిస్థితి కొనసాగింది. అవకాశం చేజారిన ప్రతిసారీ నా హృదయం ముక్కలయ్యేది. ఏడ్చుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపా. మోహన్‌లాల్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయిన సమయంలోనే.. నేను నటించాల్సిన మరో మలయాళ మూవీ కూడా నిలిచిపోయింది. దాంతో అన్‌లక్కీ ట్యాగ్‌ వేశారు. అది నన్ను మరింత కుంగదీసింది. ఆ కారణంతో దాదాపు డజను చిత్రాలు కోల్పోయా. పలువురు నిర్మాతలు తమ చిత్రాల్లో నన్ను రీప్లేస్‌ చేసి.. వేరొకరికి అవకాశం ఇచ్చారు’’

అలాగే తనపై ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. ‘‘నేనొక తమిళ చిత్రంలో నటించా. షూట్‌ సమయంలో నిర్మాతను కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆయన ఆసక్తి చూపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. నా జాతకం తన వద్ద ఉందని, నేనొక దురదృష్టవంతురాలినని అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నానని ఆయన మీడియాతో చెప్పారు. ఇదే విషయంపై నా తల్లిదండ్రులు ఆయన్ని కలవగా.. ‘తను హీరోయిన్‌లా అయినా కనిపిస్తుందా?’ అని చులకనగా మాట్లాడారు’’ అని విద్యాబాలన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని