Vijay Antony: ‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్‌ ఆంటోనీ వైరల్‌ పోస్ట్‌

విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్‌గురు’గా విడుదల చేశారు.

Updated : 20 Apr 2024 12:25 IST

చెన్నై: విజయ్‌ ఆంటోనీ (Vijay Antony), మృణాళిని రవి ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్‌గురు’గా విడుదల చేశారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకుడు. ఏప్రిల్‌ 11న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఇదిలా ఉండగా, తమ చిత్రాన్ని ఉద్దేశించి నెగెటివ్‌ రివ్యూలు చెప్పిన వారిపై విజయ్‌ అసహనం వ్యక్తం చేశారు. మంచి చిత్రాలను ప్రోత్సహించాలని కోరారు. ‘‘సినిమా గురించి అన్నీ తమకే తెలుసనుకునే చాలామంది మేధావులు.. గొప్ప కథలతో తెరకెక్కిన చాలా చిత్రాలను విమర్శిస్తున్నారు. వారి మాటలతో సినిమాపై ఒక నమ్మకానికి రాకండి. ‘రోమియో’ను దగ్గరలోని థియేటర్‌లో వీక్షించండి. దయచేసి మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా సుందర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అన్బే శివం’. మనసుని హత్తుకునే కథతో సిద్ధమైన ఈ కథ బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది.

ఇంతకీ రోమియో కథేంటంటే: అరవింద్‌ (విజయ్‌ ఆంటోని) మలేసియాలో కేఫ్‌ నడుపుతుంటాడు. అతన్ని తన చెల్లి తాలూకూ ఓ చేదు గతం వెంటాడుతుంటుంది. మరోవైపు ఆర్థిక సమస్యల నుంచి ఇంటిని గట్టేక్కించే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోతాడు. అయితే ఈ సింగిల్‌ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో మలేసియా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అరవింద్‌.. లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. లీలా మాత్రం సినిమా హీరోయిన్‌ కావాలని కలలు కంటుంది. ఆమె ఇష్టాన్ని అంగీకరించని ఇంట్లో వాళ్లు అరవింద్‌కు ఇచ్చి పెళ్లి చేస్తారు. రవింద్‌ తన భార్య మనసు గెలుచుకునేందుకు ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న చెల్లి తాలూకూ చేదు గతమేంటి? హీరోయిన్‌ అవ్వాలన్న లీలా లక్ష్యం నెరవేరిందా? వంటి ఆసక్తికర అంశాలతో ఇది రూపుదిద్దుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని