Vijay Deverakonda: ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చినందుకు నాకు పొగరనుకున్నారు: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకుడు.

Published : 03 Apr 2024 11:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - పరశురామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆరేళ్ల క్రితం పరశురామ్‌తో కలిసి పనిచేశా. ‘గీతగోవిందం’ నా కెరీర్‌లో సూపర్‌హిట్‌ మూవీగా నిలిచింది. కెరీర్‌ ఆరంభంలో.. నేను నటించిన చిత్రం రూ.100 కోట్లు కలెక్ట్‌ చేయాలని ఎన్నో కలలు కన్నాను. నాలుగో చిత్రంతోనే అది నిజమైంది. ఇప్పటివరకూ ఆ సినిమాను బీట్‌ చేసే మూవీ నేను చేయలేదు. ఇటీవల నేను నటించిన ఓ సినిమా రూ.200 కోట్లు వసూల్‌ చేస్తుందని చెప్పా. అది జరగలేదు. అలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడంపై పలువురు విమర్శలు చేశారు. అలా అనడం తప్పుకాదు.. స్టేట్‌మెంట్‌ ఇచ్చి విజయం సాధించకపోవడం తప్పు. ఏదో ఒకరోజు ఆ స్థాయి కలెక్షన్స్‌ సాధిస్తా. అప్పటివరకూ మీరు ఎంత తిట్టినా పడతా. దీన్ని పొగరనుకోవచ్చు. కానీ, నాపై నాకున్న నమ్మకం ఇది. ఇప్పటివరకూ ప్రతి సినిమా నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. నా ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన చిత్రం. పరశురామ్‌ ఈ కథ చెప్పినప్పుడు జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో విషయాలు గుర్తుకువచ్చాయి’’ అని చెప్పారు.

మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇందు పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు పరశురామ్‌కు కృతజ్ఞతలు. చిత్రీకరణ మొదలయ్యాక మొదటి 15 రోజులు ఎంతో కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఆ పాత్రను నాలాగా ఎవరూ చేయలేరనిపించింది. విజయ్‌ దేవరకొండతో పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇకపై అతడు ఫ్యామిలీ స్టార్‌’’ అని తెలిపారు. విజయ్‌, మృణాల్‌  పోషించిన పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని పరశురామ్‌ చెప్పారు. ఈ చిత్రం చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారని దిల్‌రాజు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని