vijay sethupathi: రెండు సినిమాలతో ఆగిపోతాననుకున్నా

‘నాకు హిందీ భాషపై పెద్దగా పట్టు లేకపోవడంతో ఒకట్రెండు సినిమాలకే పరిమితం అవుతా అనుకున్నాను తప్ప ఇన్ని చిత్రాలు చేస్తాననుకోలేదు’ అంటున్నారు విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి.

Updated : 08 Jan 2024 09:26 IST

  • ‘నాకు హిందీ భాషపై పెద్దగా పట్టు లేకపోవడంతో ఒకట్రెండు సినిమాలకే పరిమితం అవుతా అనుకున్నాను తప్ప ఇన్ని చిత్రాలు చేస్తాననుకోలేదు’ అంటున్నారు విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. బాలీవుడ్‌లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న ఆయన నటించిన ‘మెరీ క్రిస్మస్‌’ ఈ నెల 12 విడుదలవుతోంది. ప్రచారంలో భాగంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు సేతుపతి.
  • హిందీ జనం చూపిస్తున్న అభిమానం, ప్రేమ నాకు గొప్ప ఆశీస్సుల్లాంటివి. ఇంతగా ఆదరిస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే నా హిందీ భాషా నైపుణ్యం అలాంటిది. ‘ముంబైకర్‌’, ‘గాంధీ టాక్స్‌’ చిత్రాల కోసం కొందరు నన్ను సంప్రదించినప్పుడు అవే ఆఖరు.. ఇంకేం చేయలేను అనుకునేవాడిని.
  •  మొదటి రెండు చిత్రాలు పూర్తవముందే ‘ఫర్జీ’, ‘జవాన్‌’ అవకాశాలు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. హిందీ ఫిల్మ్‌మేకర్లు, జనం అంతగా ఆదరిస్తుంటే దీన్నో గౌరవంగా భావించాను. వాళ్లకు నచ్చేలా నేనూ తప్పకుండా వందశాతం ఇవ్వాలనుకున్నాను.
  • మొదట్లో నా హిందీ యాస చూసి ప్రేక్షకులు ట్రోల్‌ చేస్తారు అనుకునేవాడిని. అదే సందేహాన్ని ‘ఫర్జీ’ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గోస్వామి ముందుంచా. ‘ఇక్కడివాళ్లు మిమ్మల్ని తప్పకుండా ఇష్టపడతారు’ అందామె. అన్నట్టుగానే ఆ సిరీస్‌లో జనం నా తిట్లను కూడా ఎంజాయ్‌ చేశారు. దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏంçంటే ఒక్కసారి ప్రేక్షకులు మనకి కనెక్ట్‌ అయితే ఇష్టపడుతూనే ఉంటారు.
  • బాలీవుడ్‌లో నాకొచ్చిన క్రెడిట్‌ మొత్తాన్ని దర్శకులు, రచయితలకు ఇస్తాను. ఈ పాత్రను విజయ్‌ పోషించాలి అని కొందరు దర్శకులు అనుకోవడం, రచయితలు నా పాత్రని మలచడం.. నాకోసం ఒక మాస్‌ ఎనర్జీని సృష్టించడం.. అది దర్శక, రచయితల వల్లే అయ్యింది.
  • ఏడేళ్ల కిందట ఒక ఫ్రెండ్‌.. శ్రీరాం రాఘవన్‌ దర్శకత్వం వహించిన ‘ఏక్‌ హసీనా థీ’ సినిమా డీవీడీ ఇచ్చి చూడమన్నాడు. నాకు బాగా నచ్చిందా సినిమా. తర్వాత అతడి యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బద్లాపూర్‌’ కూడా చూశాను. దాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తే.. నవాజుద్దీన్‌ సిద్దిఖీ పాత్ర పోషించాను. తర్వాత నేను, శ్రీరాం మెల్‌బోర్న్‌లో ఒకసారి కలిసినప్పుడు పిచ్చాపాటీగా మాట్లాడుకున్నాం. కానీ ‘మెరీ క్రిస్మస్‌’లో కథానాయకుడి పాత్ర ఇస్తారని అస్సలు ఊహించలేదు.
  • శ్రీరాం రాఘవన్‌ టేకింగ్‌ బాగా నచ్చుతుంది. అతడితో కలిసి పని చేస్తే చాలనుకున్నా. ఏకంగా ప్రధాన పాత్ర పోషించడం నాకు బోనస్‌. శ్రీరాంతో ఇన్నాళ్లు కలిసి ప్రయాణించాక వ్యక్తిగతంగానూ తనపై గౌరవం పెరిగింది. ‘మెరీ క్రిస్మస్‌’లో నేను ఆల్బర్ట్‌ అనే మంచి మనసున్న అమాయకుడి పాత్రలో కనిపిస్తాను.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని