Vijayakanth: నటుడు విజయకాంత్‌ హెల్త్‌ బులెటిన్‌.. ఆస్పత్రి వర్గాలు ఏమన్నాయంటే?

నటుడు, డీఎండీకే అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకాంత్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదలైంది.

Updated : 29 Nov 2023 19:43 IST

చెన్నై: ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయకాంత్‌, డీఎండీకే అధ్యక్షుడు (Vijayakanth) చెన్నైలోని ఎం.ఐ.ఒ.టి. ఇంటర్నేషనల్‌ (MIOT International) హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట పలు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ (Vijayakanth) విడుదల చేశాయి. ‘‘విజయకాంత్‌ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోంది. పల్మనరీ (శ్వాసకోస సంబంధిత) చికిత్స చేయాల్సి వస్తోంది. విజయకాంత్‌ పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. మరో 14రోజులపాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది’’ అని ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌లో పేర్కొన్నాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించిన విషయం తెలిసిందే. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్‌. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్‌.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. ఇక, విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని