Vijayendra Prasad: ‘బజరంగీ భాయీజాన్‌’ రాజమౌళి తిరస్కరించడానికి కారణం అదే: విజయేంద్రప్రసాద్‌

సల్మన్‌ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయీజాన్‌’ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తిరస్కరించడానికి గల కారణాన్ని విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. 

Published : 29 Feb 2024 00:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘బజరంగీ భాయీజాన్‌’ (Bajrangi Bhaijaan). కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో 2015లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. తన స్వదేశానికి చేర్చడానికి భారతదేశానికి చెందిన యువకుడు చేసే సాహస యాత్రే ఈ సినిమా. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తిరస్కరించడానికి గల కారణాన్ని సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ (Vijayendra Prasad) తెలిపారు. ‘‘నేను బజరంగీ భాయీజాన్‌ స్క్రిప్ట్‌ మొదట రాజమౌళికే వివరించాను. స్టోరీ వింటూ అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కథను నువ్వు తెరకెక్కిస్తావా? లేదా వేరే ఎవరికైనా దీనిని ఇచ్చేయనా? అని అడిగాను. మౌళి దానిని మరొకరికి ఇవ్వమని చెప్పాడు. సినిమా విడుదలైన తర్వాత తను నా దగ్గరకి వచ్చి ‘మీరు సరైన సమయంలో నన్ను అడిగివుంటే నేనే చేసేవాణ్ణి. బాహుబలి క్లైమాక్స్‌ షూటింగ్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు వచ్చి అడిగారు. దాంతో నేను చేయలేనని చెప్పాను. అదే మీరు ఓ పది రోజులు ముందుగాని, తర్వాతగాని అడిగి ఉంటే చేస్తాననే చెప్పేవాడిని’ అన్నాడు. రాజమౌళి సల్మాన్‌ఖాన్‌తో సినిమా చేస్తాడా అన్నది చెప్పలేము. కానీ మంచి స్క్రిప్ట్‌ ఉంటే అతను ఏం చేస్తాడో చూడటం ఓ అద్భుతమే’’ అని విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. 

బజరంగీ భాయీజాన్‌ విడుదలై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.‘‘ కథ మొదటి భాగం నుంచి మరో 8 సంవత్సరాల గతంతో ముడిపడి ఉంటుంది. బజరంగీ భాయీజాన్‌ వంటి మంచి హిట్‌ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు విజయేంద్రప్రసాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని