Thangalaan: ‘తంగలాన్‌’.. భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరుస్తుంది: విక్రమ్‌

విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’ సినిమా టీజర్‌ బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది

Updated : 01 Nov 2023 15:15 IST

చెన్నై: విక్రమ్‌ (Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). కర్ణాటక, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌)లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఓ తండాకు చెందిన వ్యక్తిగా విక్రమ్‌ నటన అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. టీజర్‌ విడుదల కార్యక్రమంలో విక్రమ్‌, పా.రంజిత్‌ పాల్గొని, పలు విషయాలు పంచుకున్నారిలా.

‘‘ఈ సినిమా కోసం పా.రంజిత్‌తో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. తాను తెరకెక్కించిన గత చిత్రం ‘సార్పట్ట’తో పోలిస్తే 100 రెట్లు అద్భుతంగా ఆయన దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా షూట్‌ ఎంతో క్లిష్టంగా అనిపించింది. మేకప్ కారణంగా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఒక్క నిమిషం కూడా సెట్‌లో రిలాక్స్‌ కావడానికి సమయం దొరకేది కాదు. ‘తంగలాన్‌’ అంటే కేవలం ఒక సాధారణ సినిమా కాదు. ‘కాంతార’ చిన్న చిత్రమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే, ‘తంగలాన్‌’ సైతం భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్య పరుస్తుంది. షూట్‌ సమయంలో కేజీయఫ్‌ వాసులు ఎలాంటి జీవనాన్ని అయితే గడిపారే అలాగే నేనూ జీవించా’’ అని విక్రమ్‌ అన్నారు.

కారణం చెప్పకుండానే సుశాంత్‌ బ్రేకప్‌ చెప్పాడు: నటి

అనంతరం పా.రంజిత్‌ మాట్లాడుతూ.. ‘‘షూటింగ్‌ సమయంలో విక్రమ్‌ గాయపడ్డారు. పక్కటెముకలకు దెబ్బ తగిలింది. దీంతో ఆయన నెల రోజుల పాటు షూట్‌ నుంచి విరామం తీసుకున్నారు. ఆ ప్రమాదం నుంచి కోలుకుని సెట్‌కి వచ్చాక ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆయన పాల్గొనాల్సి వచ్చింది. నొప్పి ఉన్నప్పటికి ఆయన నో అనకుండా షూట్‌ కంటిన్యూ చేశారు. కొన్ని షాట్స్‌కు  ఆయనే స్వయంగా వన్‌ మోర్‌ అంటూ ముందుకు వచ్చారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని తెలిపారు.

ఈ సినిమాలో మాళవిక మోహన్‌, పార్వతి కథానాయికలుగా నటిస్తున్నారు. పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీలో సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్‌, నీలం ప్రొడక్షన్‌ సంస్థల పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ స్వరాలందిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్న ఈ సినిమా 2024 జనవరి 26న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు