Vikram: అనురాగ్‌ వ్యాఖ్యలపై విక్రమ్‌ రియాక్షన్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హీరో అభిమానులు

తనని ఉద్దేశిస్తూ ఇటీవల అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలపై తాజాగా విక్రమ్‌(Vikram) స్పందించారు.

Published : 23 May 2023 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కెన్నెడీ’ (Kennedy) విషయంలో తనని ఉద్దేశిస్తూ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) చేసిన వ్యాఖ్యలపై నటుడు విక్రమ్‌ (Vikram) స్పందించారు. అనురాగ్‌ తన కోసం కథ రాశారని తెలిసిన వెంటనే, తాను ఆయన్ని సంప్రదించినట్లు చెప్పారు. సుమారు ఏడాది క్రితం తమ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘డియర్‌ అనురాగ్‌ కశ్యప్‌.. సోషల్‌మీడియాలో ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం సుమారు ఏడాది క్రితం మన మధ్య జరిగిన సంభాషణను ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పటికీ (ఈమెయిల్‌, మెస్సేజ్‌ల రూపంలో) నా నుంచి మీకు ఎలాంటి సమాధానం రాలేదని గతంలో మీరు ఒక నటుడితో చెప్పారు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే మీకు ఫోన్‌ చేశాను. మీరు ఏదైతే మెయిల్‌ ఐడీకి సందేశాలు పంపించారో అది యాక్టివ్‌గా లేదని, నా మొబైల్‌ నంబర్‌ కూడా దాదాపు రెండేళ్ల క్రితమే మార్చేశానని.. అందుకే నన్ను రీచ్‌ కాలేకపోయారని ఆనాడే మీకు తెలిపాను. అలాగే,  ‘కెన్నెడీ’ నాకెంతో నచ్చిందని అప్పుడే చెప్పాను కదా’’ అని విక్రమ్‌ ట్వీట్‌ చేశారు.

ఇక, దీనిపై అనురాగ్‌ కశ్యప్‌ స్పందిస్తూ.. ‘‘నిజమే బాస్‌.. ఒక నటుడి ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్‌ నన్ను సంప్రదించారు. అప్పుడే మాకు కూడా తెలిసింది ఆయనకు వేరే ఫోన్‌ నంబర్‌ ఉందని. అధికారిక మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలను మాకు ఇచ్చారు. అలాగే, ఆయన నా స్క్రిప్ట్‌ చదవడానికి ఆసక్తి కనబరిచారు. కాకపోతే అప్పటికే మేము షూటింగ్‌ కోసం షెడ్యూల్‌ సిద్ధం చేసేసుకున్నాం. మా చిత్రానికి ‘కెన్నెడీ’ అనే టైటిల్‌ పెట్టుకోవడానికి ఆయన పూర్తిగా అంగీకారం తెలిపారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కెన్నెడీ’ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను అతిగా చూడాల్సిన అవసరం లేదు. ఆయనతో కలిసి పనిచేయకుండా రిటైర్‌ అయితే కాను’’ అని స్పష్టత ఇచ్చారు.

రాహుల్‌ భట్‌, సన్నీలియోనీ జంటగా నటించిన చిత్రం ‘కెన్నెడీ’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ప్రదర్శన కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జరిగింది. ఇందులో భాగంగా అనురాగ్‌ మాట్లాడుతూ.. విక్రమ్‌ను దృష్టిలో ఉంచుకునే తాను ఈ కథను సిద్ధం చేశానని, ఈ సినిమా విషయంలో ఆయన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, అందుకే రాహుల్‌తో ఈ సినిమా చేశానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో విక్రమ్‌ తాజాగా దీనిపై స్పందించారు. విక్రమ్‌ ట్వీట్‌తో ఆయన అభిమానులు.. అనురాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చెప్పేముందు కాస్త క్లియర్‌గా చెప్పాలని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని