Vishal: నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్‌

‘రత్నం’ (Rathnam) రిలీజ్‌లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లో నటుడు విశాల్‌ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు.

Published : 22 Apr 2024 17:45 IST

చెన్నై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం పోలింగ్‌ కేంద్రానికి నటుడు విశాల్‌ (Vishal) సైకిల్‌పై రావడం అంతటా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. హీరో విజయ్‌ను స్ఫూర్తిగా తీసుకునే ఆయన ఈవిధంగా చేశారని చాలామంది మాట్లాడుకున్నారు. ఈ విషయంపై తాజాగా జరిగిన ‘రత్నం’ ఈవెంట్‌లో విశాల్‌ స్పందించారు. అందరూ అనుకుంటున్నట్లు తాను విజయ్‌ను ఫాలో కాలేదన్నారు.

‘‘విజయ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని అతడు ఈ స్థాయికి వచ్చాడు. విమర్శలు వచ్చినప్పుడు మానసికంగా కుంగుబాటుకు గురవుతాం. ఆ బాధను తట్టుకుని స్టార్‌గా ఎదగడం సాధారణ విషయం కాదు.  అందుకే అతడంటే నాకెంతో ఇష్టం. వ్యక్తిగత కారణాల వల్ల ఆరోజు పోలింగ్‌ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లా. విజయ్‌ను ఇమిటేట్‌ చేయడం కోసం అలా చేయలేదు. ప్రస్తుతం నా తల్లిదండ్రులకు మాత్రమే కారు ఉంది. నాకు లేదు. కొంతకాలం క్రితం అమ్మేశా. నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. సైకిల్‌పై అయితే ఎటువంటి ఇబ్బందిలేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు అనిపించింది’’ అని అన్నారు.

అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఇంట్లోవాళ్లందరూ నా పెళ్లి కోసమే ఎదురుచూస్తున్నారు. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కోసం భవనం నిర్మించిన వెంటనే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం అది నిర్మాణదశలో ఉంది. ఆ భగవంతుడు నాకోసం ఒక అమ్మాయిని పుట్టించే ఉంటాడు. తప్పకుండా ఆమె నాకోసం ఎదురుచూస్తుంటుంది’’ అని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని