Vishal: ఆ అమ్మాయి జోలికి రావద్దు

‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్‌. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే.

Updated : 17 Apr 2024 12:47 IST

‘‘ఆ అమ్మాయి నా ప్రాణం.. నా ఊపిరి. తన జోలికొస్తే వెతుక్కుంటూ వచ్చి నరికేస్తా’’ అని హెచ్చరిస్తున్నారు విశాల్‌. మరి ఆయన ప్రేమ కథేంటి? దానికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ‘రత్నం’ చూడాల్సిందే. విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన ఈ సినిమాని హరి తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘తమిళనాడు.. ఏపీ బోర్డర్‌లో ఏం జరుగుతోంది’’ అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో విశాల్‌ ఓ ఊచకోతను చూపించారు.


థ్రిల్‌ చేసే భవనమ్‌

 సప్తగిరి, ధనరాజ్‌, షకలక శంకర్‌ ప్రధాన పాత్రల్లో బాలాచారి కూరెళ్ల తెరకెక్కించిన చిత్రం ‘భవనమ్‌’. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో ఆర్‌.బి.చౌదరి, వాకాడ అంజన్‌ కుమార్‌, వీరేంద్ర సీర్వి సంయుక్తంగా నిర్మించారు. అజయ్‌, మాళవిక సతీశన్‌, స్నేహ ఉల్లాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌తో పాటు దీంట్లోని ‘‘యాదమ్మ..’’ అనే గీతాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్మాత ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో ఇది 95వ సినిమా. దర్శకుడు బాలాచారి ఎంతో చక్కగా తెరకెక్కించారు. అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. ఓవైపు నవ్విస్తూనే ఆద్యంతం ఉత్కంఠత రేకెత్తిస్తూ సాగుతుంది. చరణ్‌ అర్జున్‌ సంగీతం దీనికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు దర్శకుడు బాలాచారి. కార్యక్రమంలో వి.సముద్ర, శంకర్‌, బిత్తిరి సత్తి, స్నిగ్థ, గద్దర్‌ నర్సన్న తదితరులు పాల్గొన్నారు.


‘రుద్రాక్షపురం’ విడుదల

మణిసాయితేజ, వైఢూర్య జంటగా నటిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఆర్‌.కె.గాంధీ తెరకెక్కిస్తున్నారు. కొండ్రాసి ఉపేందర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందుస్తు వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్‌, దర్శక నిర్మాత సాయి వెంకట్‌, నటి ప్రశాంతి హారతి, దర్శకులు ముని సహేకర్‌, శ్రీరాజ్‌ బల్లా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై.. ‘రుద్రాక్షపురం’ చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని ఆకాంక్షించారు.  


అందరూ మెచ్చే ‘సిల్క్‌ శారీ’

వాసుదేవ్‌ రావు, రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి నాయకానాయికలుగా టి.నాగేందర్‌ తెరకెక్కించిన చిత్రం ‘సిల్క్‌ శారీ’. కమలేష్‌ కుమార్‌ నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లుక్‌, టీజర్‌ చాలా బాగున్నాయి. ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమని దర్శకుడు నమ్మకం కలిగించేలా చేశాడు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో రూపొందింది. ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ బలమైన కథాంశాన్ని అల్లుకుని దీన్ని సిద్ధం చేశాం. కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’’ అన్నారు హీరో వాసుదేవ్‌. ఈ సినిమాకి సంగీతం: వరికుప్పల యాదగిరి, ఛాయాగ్రహణం: సనక రాజశేఖర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు