Vishal: ఉదయనిధి బ్యానర్‌తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్‌

నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్‌ జెయింట్‌తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్‌ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు.

Updated : 17 Apr 2024 12:21 IST

చెన్నై: ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ సంస్థతో నెలకొన్న వివాదంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్‌ (Vishal) స్పందించారు. ఆ సంస్థకు చెందిన ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగిందన్నారు. ‘‘నేను నటించిన ‘ఎనిమి’ (2021) రిలీజ్‌ సమయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అది ఉదయనిధి స్టాలిన్‌ దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. రెడ్‌ జెయింట్‌లో ఉన్న ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగింది. ఒకరు కష్టపడి తెరకెక్కించిన చిత్రాన్ని వాయిదా వేసుకోమని అడిగే హక్కు మరొకరికి లేదు. ఎందుకంటే, సినిమా ఏ ఒక్కరి సొత్తు కాదు. ‘తమిళ సినిమా నా చేతుల్లోనే ఉంది’ అని చెప్పిన చాలామంది కనుమరుగయ్యారు. నా నిర్మాత కోసం నేను ముందు నిలబడ్డా. ‘ఒక చిత్రాన్ని తీర్చిదిద్దడానికి రక్తాన్ని ధారపోస్తుంటే.. ఏసీ రూమ్‌లో కూర్చొనే మీరు దాన్ని వాయిదా వేయమని కోరడం న్యాయం కాదు. అసలు అలా అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇండస్ట్రీని ఏమైనా లీజుకు తీసుకున్నారా?’ అని ప్రశ్నించా’’

‘‘మార్క్‌ ఆంటోనీ’ టైమ్‌లోనూ ఇదే రిపీట్‌ అయ్యింది. జీర్ణించుకోలేకపోయా. అతడికి ఫోన్‌ చేసి.. ‘వాయిదా వేయమనడానికి నువ్వెవరు? సినిమా ఫలితాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు’ అని చెప్పా. అనుకున్న తేదీకి విడుదల చేశా. నా నిర్మాతకు లాభాలు వచ్చాయి. దర్శకుడు అధిక్‌కు మంచి జీవితం లభించింది. నా ఖాతాలో హిట్‌ పడింది. నేను చేసిన తదుపరి చిత్రం ‘రత్నం’కు కూడా అతడు ఇబ్బందులు సృష్టించవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటా. ఇలా చెప్పడానికి ఎవరికీ ధైర్యం ఉండదు. నిర్మాతలందరూ ఏకతాటి పైకి  వస్తే చిత్రపరిశ్రమ మరో స్థాయిలో ఉంటుంది’’ అని విశాల్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని