Vishwak Sen: ఆ సినిమాలేవీ నన్ను భయపెట్టలేదు: విష్వక్‌ సేన్‌

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు విష్వక్‌ సేన్‌. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 27 May 2024 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగతంగా తనకు హారర్‌ జానర్‌ అంటే ఇష్టం ఉండదని, ఆ నేపథ్యంతో రూపొందిన చిత్రాలేవీ తనను భయపెట్టలేదని నటుడు విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) అన్నారు. థ్రిల్‌ కోసం ఏ హారర్‌ చిత్రాన్ని చూసినా నిరాశే ఎదురయ్యేదని పేర్కొన్నారు. ఒకవేళ అవకాశం వస్తే.. ప్రేక్షకులు, అభిమానుల కోసమే హారర్‌ మూవీస్‌ చేస్తానని చెప్పారు. తాను హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. గతంలో తాను నటించిన హిట్‌ చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’ విడుదలైన తేదీనే (మే 31).. ఈ ఏడాది ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్‌ కానుండడం ఆనందంగా ఉందన్నారు.

నటనలో ముంబయిలో శిక్షణ తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ.. ‘‘అప్పుడు నా వయసు 17 ఏళ్లు. నేను మాట్లాడే హిందీ అక్కడి వారికి అర్థమవక నవ్వేవారు. తర్వాత, ఓ స్కిట్‌తో నేనేంటో నిరూపించుకున్నా’’ అని తెలిపారు. మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవేళ ఎన్టీఆర్‌ నటించిన సినిమా ఏదైనా రీమేక్‌ చేయాల్సివస్తే తాను ‘నా అల్లుడు’ని ఎంపిక చేసుకుంటానని చెప్పారు.

1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రాజకీయం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహాశెట్టి, అంజలి హీరోయిన్లు. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇందులోభాగంగానే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Gangs of Godavari Pre Release Event)ను హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించనుంది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దీనికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని