Vishwak Sen: ఆయన చేసిన దానివల్ల నేనే ఎక్కువ నష్టపోయా: విశ్వక్‌సేన్‌

వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌. ఒకరు చేసిన పని వల్ల తాను నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

Updated : 19 Feb 2024 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా ప్రముఖ నటుడు అర్జున్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై, ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈమేరకు అప్పట్లో ప్రెస్‌మీట్‌ పెట్టి, విశ్వక్‌సేన్‌ కమిట్‌మెంట్‌ లేని నటుడని అర్జున్‌ ఆరోపించడం చర్చనీయాంశమైంది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ పరిణామంపై ప్రశ్న ఎదురవగా విశ్వక్‌ స్పందించారు.

‘‘బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది? నేను సినిమాని క్యాన్సిల్‌ చేయమని చెప్పలేదు. ఒక్కరోజు షూటింగ్‌ ఆపమన్నానంతే. దానికే ఆయన మా ఇంటికొచ్చి అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి చేయడం లాంటివి ఎన్నో జరిగాయి. అవి ఎవరికీ తెలియదు. నాకు సినీ నేపథ్యం లేదనో, ఇంకేదో అనుకుని ప్రెస్‌మీట్‌ పెట్టారు. కానీ, నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న పారితోషికానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశా. ఆయన కోపంలో చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే’’ అని అన్నారు.

అదే ఇంటర్వ్యూలో.. ప్రముఖ హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రానాలతో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘సవారి’ దర్శకుడితో సినిమా ఇంకా ప్రారంభం కాకపోవడంపై స్పందిస్తూ.. ఫస్టాఫ్‌ స్టోరీ పూర్తయిందని, సెకండాఫ్ విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అందుకే ఆ ప్రాజెక్టు ఆలస్యమైందని, ఎప్పటికైనా నటిస్తానని తెలిపారు. కాలేజీ నేపథ్యంలో ఆ కథ సాగుతుందన్నారు. విశ్వక్‌ నటించిన ‘గామి’ (Gaami) సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. నూతన దర్శకుడు విద్యాధర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వక్‌.. అఘోరాగా కనిపించనున్నారు. ఆయన నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. 1990ల నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి కథానాయిక. 2023 డిసెంబరులోనే విడుదలవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. హీరోగా మరో రెండు చిత్రాలు, నిర్మాతగా ఓ సినిమాతో బిజీగా ఉన్నారు విశ్వక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు