Vishwak Sen: ఆయన యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయ్యాడు: విశ్వక్‌ సేన్‌

విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘గామి’. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు.

Published : 01 Mar 2024 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అర్జున్‌ రెడ్డి’, ‘యానిమల్‌’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ‘గామి’ (Gaami) ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అఘోరాగా నటించిన సినిమా ఇది. చాందినీ చౌదరి కథానాయిక. విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా నిర్వహించిన వేడుకలో సందీప్‌ గురించి విశ్వక్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.

‘‘నా గత సినిమా విడుదలై మరికొన్ని రోజుల్లో సంవత్సరం అవుతుంది. ఈలోపే ఇంకో చిత్రం మీ ముందుకు తీసుకురావాలనుకున్నా. ‘గామి’ని ప్రారంభించినప్పుడు నేనెవరో మీకు తెలియదు. నా కెరీర్‌ తొలి నాళ్లలో మొదలుపెట్టిన సినిమా ఇది. విద్యాధర్‌కు కథ చెప్పడం రాదని నాకు అర్థమైంది. అందుకే స్క్రిప్టుని నేనే ఓ రోజంతా చదివి, ఈ సినిమాలో నటిస్తానని తనకు చెప్పా. తక్కువమందితో మొదలైందీ ప్రయాణం. అవుట్‌పుట్‌ చూస్తుంటే ఆనందంగా ఉంది. నా నుంచి మీరు కోరుకునే మాస్‌ డైలాగ్స్‌, ఉర్రూతలూగించే పాటలు, ఫైట్లు ఇందులో ఉండవు. కానీ, వాటికి ఎంత ఎంజాయ్‌ చేస్తారో ఈ కథకూ అంతే ఎంజాయ్‌ చేస్తారు. మేకింగ్‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో 90 శాతం కష్టం విద్యాధర్‌ది అయితే మిగిలిన 10 శాతం టీమ్‌ది’’

‘‘నా ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా ఈవెంట్‌కు రావాల్సిఉండగా సందీప్‌ అన్న అప్పుడు రాలేదు. ఈ సినిమా వేడుకకు వచ్చాడు. యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయిన వ్యక్తి ఆయనే. దర్శకుడు రాజమౌళి తెలుగువారంతా గర్వంగా ఫీలయ్యేలా చేస్తే, కాలర్‌ ఎగరేసేలా సందీప్‌ చేశాడు’’ అని విశ్వక్‌ పేర్కొన్నారు.

అది మామూలు విషయం కాదు: సందీప్‌ రెడ్డి

‘‘విభిన్న చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ఆరేళ్లు దీనికోసం కష్టపడ్డారు. ఇన్నేళ్లు ఒక్క సినిమాతో ప్రయాణించడం మామూలు విషయం కాదు. ట్రైలర్‌ బాగుంది. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ప్రభాస్‌ (Prabhas)తో తాను రూపొందించబోయే ‘స్పిరిట్‌’ (Spirit) సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని