N Shankar: హిస్టారికల్‌ వెబ్‌సిరీస్‌లకు శ్రీకారం చుట్టిన ఎన్‌ శంకర్‌.. నేపథ్యాలివే

ప్రముఖ దర్శకుడు ఎన్‌. శంకర్‌ మూడు హిస్టారికల్‌ వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ వివరాలివీ..

Published : 28 Feb 2024 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమాలను తెరకెక్కించి విజయాలు అందుకున్న దర్శకుడు ఎన్‌. శంకర్‌ (N Shankar). ఎన్‌కౌంట‌ర్‌, శ్రీ‌రాముల‌య్య‌, జ‌యం మ‌న‌దేరా, ఆయుధం, భ‌ద్రాచ‌లం, జై బోలో తెలంగాణ వంటి చిత్రాలు ఆయన డైరెక్షన్‌లో రూపొందినవే. కొంత విరామం తీసుకున్న ఆయన మూడు హిస్టారికల్‌ వెబ్‌సిరీస్‌లకు శ్రీకారం చుట్టారు. దర్శకత్వం చేయట్లేదుగానీ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. ‘ఎన్‌ శంకర్‌ టీవీ అండ్‌ ఫిల్మ్‌ స్టూడియో’ బ్యానర్‌పై తానే నిర్మించనున్నారు. ఆ వెబ్‌సిరీస్‌ల వివరాలివీ..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామాల ఇతివృత్తంగా ఓ వెబ్‌సిరీస్‌ రూపొందించనున్నారు. వీటిని ప్రజల కోణంలోనే చూపించే ప్రయత్నం చేస్తామని టీమ్‌ తెలిపింది. అక్టోబరులో షూటింగ్‌ ప్రారంభం కానుంది. మహాత్మా జ్యోతీరావు పూలే స్ఫూర్తితో రెండో సిరీస్‌ రానుంది. ఆయన జీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనల ఆధారంగా రూపొందించనున్నారు. నాటి దురాచారాలను ఖండించే క్రమంలో  ఎదుర్కొన్న అవమానాలు, చేసిన త్యాగాలు తదితర అంశాలను ప్రధానంగా చూపించనున్నారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆయన వ్యక్తిగత జీవిత పాఠాలతో మూడో వెబ్‌సిరీస్‌ని తీసుకురానున్నారు. జ్యోతీరావు పూలే, అంబేడ్కర్‌లపై తీసే వెబ్‌సిరీస్‌లు వారి బయోపిక్స్‌ కాదని టీమ్‌ స్పష్టం చేసింది. వారి గురించి ఈ తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో సిరీస్‌లు రూపొందిస్తున్నట్లు పేర్కొంది. మూడేళ్లుగా వీటిపై వర్క్‌ జరుగుతోందని, తెలుగుతోపాటు హిందీలో విడుదల చేస్తామని శంకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని