Kajal Aggarwal: పెళ్లి తర్వాత ఒక్క హీరోయిన్‌ కెరీరే మారాలా?

తెలుగు తెరపై అందాలు ఒలికించిన చందమామ కాజల్‌... ‘సత్యభామ’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 06 Jun 2024 09:17 IST

తెలుగు తెరపై అందాలు ఒలికించిన చందమామ కాజల్‌... ‘సత్యభామ’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. రెండు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న ఆమె... పెళ్లి తర్వాత కొత్త రకమైన కథలపై దృష్టి పెట్టింది.  అందులో భాగంగా చేసిన సినిమానే ‘సత్యభామ’. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కాజల్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విషయాలివీ...


రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. కానీ బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్లు అద్భుతమైన వ్యక్తులు. వాళ్లలోని నాయకత్వ లక్షణాలు గొప్పగా ఉంటాయి. వాళ్ల నాయకత్వంలో నియోజకవర్గాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. 

మీ కెరీర్‌లో ఇప్పుడే నాయికా ప్రధానమైన కథలపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇదివరకు ఈ తరహా కథలు మీ దగ్గరకు రాలేదా?

చాలా కథల్నే విన్నాను, ఒకట్రెండు చేశాను కూడా. కానీ ఆశించిన ఫలితం రాలేదు. నాకు అర్థమైందేమిటంటే... ఇలాంటి కథలు తీస్తున్నప్పుడు నమ్మదగిన బృందం ఎంతో   అవసరమని! ‘గూఢచారి’, ‘మేజర్‌’ చిత్రాలతో తనేమిటో నిరూపించుకున్న దర్శకుడు శశికిరణ్‌ తిక్క ఈ సినిమా వెనుక ఉన్నారు. అంతే కొత్త ఆలోచనలున్న దర్శకుడు సుమన్‌ చిక్కాల, ఇతర బృందం మాకు తోడైంది. వీళ్లు తయారు చేసిన కథ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో వెనుదిగిరి చూసుకోలేదు. నా కెరీర్‌లో సరైన సమయంలో నేను చేసిన సరైన సినిమా ఇదని నమ్ముతున్నా. 

నాయికా ప్రధానమైన సినిమా చేస్తున్నప్పుడు ప్రచారం, మార్కెట్‌ వ్యవహారాలు మీపైనే ఆధారపడి ఉంటాయి. ఒత్తిడికి గురయ్యారా?

ఒత్తిడి కంటే కూడా బాధ్యత మరింతగా పెరిగినట్టు అనిపించింది. మిగతా సినిమాలతో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. నాకు ఇలాంటి సవాళ్లంటే ఇష్టమే. వీటిని స్వీకరించినప్పుడే కదా నటిగానైనా, వ్యక్తిగతంగానైనా నేను ఎదిగేది? విడుదల దగ్గరపడుతున్న కొద్దీ కొంచెం ఆత్రుతగా అనిపించినా  ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 

ఏ రకంగా ఇది మీకు ప్రత్యేకమైన సినిమా అంటే ఏం చెబుతారు? 

నేను ఇప్పటివరకూ ఎన్నో పాత్రలు చేశాను కానీ, ఇలాంటి భావోద్వేగ భరితమైన సినిమాని చేయడం ఇదే తొలిసారి. దానికితోడు యాక్షన్‌ కూడా చేశా.  నటిస్తున్నప్పుడు ఇన్నేళ్ల ప్రయాణంలో ఎప్పుడూ అనుభవంలోకి రాని ఎన్నో విషయాలు తెలిశాయి. ఇందులోని ప్రతి భావోద్వేగం ఎంతో సహజంగా ఉంటుంది. 

యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా?

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇదివరకే  తర్ఫీదు పొందాను. అది ఈ సినిమాకి బాగా పనిచేసింది. నా శైలికి, నా పాత్రకి తగ్గట్టుగా ఇందులో పోరాట ఘట్టాలు ఉంటాయి. వాటిని చేసేటప్పుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బాబు పుట్టాక ఫిట్‌నెస్‌ పరంగా ప్రత్యేకంగా  కసరత్తులు చేసి ఈ సినిమా కోసం కెమెరా ముందుకొచ్చా. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ సుబ్బు సహజంగా అనిపించేలా పోరాట ఘట్టాల్ని తీర్చిదిద్దారు.  

ఇంతకీ ‘సత్యభామ’తో ఏం చెబుతున్నారు?

యువతరానికి సంబంధించి ఆలోచింపజేసే  అంశాలు ఇందులో చాలా ఉంటాయి. మతం కోణం కూడా ఉంటుంది. ఒకరికి వ్యతిరేకంగానో, మరొకరికి అనుకూలంగానో ఆ కోణాన్ని స్పృశించలేదు. నేనొక పోలీస్‌ అధికారిగా కనిపిస్తా. పోలీసు డ్రెస్‌ వేసుకుంటే చాలు...ప్రత్యేకమైన భావోద్వేగం కలుగుతుంది. 

కొత్తగా చేస్తున్న సినిమాల సంగతులేమిటి? 

కొత్తగా రెండు సినిమాలకు సంతకం చేశా. వాటిని త్వరలోనే నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి. ఇప్పుడు నటన, వ్యక్తిగత జీవితంతోనే బిజీగా ఉన్నాను. నిర్మాణంపై దృష్టిపెట్టే ఆలోచన లేదు.

కథానాయికలకి పెళ్లి తర్వాత ఇదివరకు అవకాశాలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి అనుకోవచ్చా?

మారిన కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పెళ్లి తర్వాత అంతకుముందు కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కథానాయికలు. అయినా పెళ్లి తర్వాత ఒక్క  హీరోయిన్‌ కెరీర్‌ మాత్రమే  ఎందుకు మారాలి? అందరికీ వ్యక్తిగత జీవితం ఉన్నట్టే హీరోయిన్స్‌కి కూడా ఉంటుంది కదా! 60 సినిమాలు చేసిన నేను, వైవిధ్యమైన ప్రయత్నాలు చేయడానికి తగిన సమయం ఇదే అని నమ్ముతున్నా. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌నీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నా. నా కుటుంబం కూడా చక్కటి సహకారం అందిస్తోంది. 

‘ఆచార్య’ తరహాలోనే ‘భారతీయుడు2’లో మీరు చేసిన సన్నివేశాల్ని తొలగించారని తెలిసింది. నిజమేనా? 

నాకూ ఈమధ్యే ఆ విషయం తెలిసింది. ‘భారతీయుడు2’లో నేను లేకపోయినా,  ‘భారతీయుడు 3’లో కనిపిస్తా. అలా  ఎందుకు జరిగిందో తెలియదు కానీ, కొన్ని విషయాలు మంచికే జరుగుతాయని నమ్ముతా. ‘భారతీయుడు3’ కోసం నేను చిత్రీకరణ కూడా పూర్తి చేశా. అందులో నా పాత్ర అంత సులభంగా గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని