Jaya Janaki Nayaka: సినీ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన ‘జయ జానకీ నాయక’

Jaya Janaki Nayaka on youtbe: యూట్యూబ్‌లో ‘జయ జానకీ నాయక’ మూవీ ఎక్కువ వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించింది.

Updated : 22 Feb 2024 17:06 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాలు, ఓటీటీలు సినిమా హద్దులను చెరిపేస్తున్నాయి. ఒక భాషలో ఏదైనా మూవీ హిట్‌ అయితే చాలు.. ఇతర భాషల సినీ ప్రేమికులు ఆ మూవీని  తమ వాచ్‌ లిస్ట్‌లో పెట్టేసుకుంటున్నారు. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు నిర్మాణ సంస్థలు ఓటీటీలు కూడా ఆ మూవీలను ఇతర భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేస్తున్నాయి. అలా యూట్యూబ్‌లో విడుదలైన తెలుగు మూవీ ‘జయ జానకీ నాయక’ (Jaya Janaki Nayaka) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ సాధించని విధంగా  ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 800 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియాలోనే అత్యధిక మంది యూట్యూబ్‌లో వీక్షించిన చిత్రంగా నిలిచింది.

బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) జంటగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ యాక్షన్‌ డ్రామా ఇది. ఆగస్టు 2017లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ తెలుగులో మిశ్రమ స్పందనలకే పరిమితమైనా యాక్షన్‌ ప్రియులను బాగా అలరించింది. ఈ క్రమంలో ‘పెన్‌ మూవీ’ సంస్థ ‘జయ జానకీ నాయక కోహినూర్‌’ పేరుతో ఫిబ్రవరి 8, 2019న ఈ మూవీని హిందీలోకి డబ్‌ చేసి యూట్యూబ్‌ వేదికగా విడుదల చేసింది. యాక్షన్‌ మూవీలను ఇష్టపడే ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్‌ అయిపోయారు. ఇప్పుడు ఏకంగా 800 మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది. ఇది ఇలాగే కొనసాగితే బిలియన్‌ వ్యూస్‌ సాధించడం పెద్ద విషయమేమీ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పదిలో ఏడు తెలుగు చిత్రాలే!

యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ కలిగిన పది సినిమాల్లో ఏడు తెలుగువే కావడం గమనార్హం. ఇందులో మూడు చిత్రాలకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడం విశేషం. మొదటి స్థానంలో ‘జయ జానకీ నాయక కోహినూర్‌ (800 మిలియన్‌ వ్యూస్‌) ఉండగా, రెండో స్థానంలో ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన కేజీయఫ్‌ (KGF) (772 మిలియన్‌ వ్యూస్‌) వేగంగా దూసుకెళ్తోంది. 800 మిలియన్‌ వ్యూస్‌ మార్కు దాటడం ఈ మూవీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇక మూడో స్థానంలో సీతారామ్‌ (తెలుగులో దర్శకుడు తేజ తీసిన సీత - 643 మిలియన్‌ వ్యూస్‌) ఉంది.

  • ది సూపర్ ఖిలాడీ (నేను శైలజ-588 మిలియన్‌ వ్యూస్‌)
  • అ ఆ (549 మిలియన్‌ వ్యూస్‌)
  • దమ్‌దార్‌ ఖిలాడీ (హలో గురు ప్రేమ కోసమే- 549 మిలియన్‌ వ్యూస్‌)
  • సూర్య వంశం (అమితాబ్‌- 481 మిలియన్‌ వ్యూస్‌)
  • డియర్‌ కామ్రేడ్‌ (391 మిలియన్‌ వ్యూస్‌)
  • సరైనోడు (368 మిలియన్‌ వ్యూస్‌)
  • మేడమ్‌ గీతా రాణి ( జ్యోతిక రాటచాయ్‌- 368 మిలియన్‌ వ్యూస్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని