Chiranjeevi Biography: చిరంజీవి ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని భయపడ్డా : రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌

తనకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ స్పష్టం చేశారు.

Updated : 09 Feb 2024 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను చిరంజీవి (Chiranjeevi) ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని చిరు ఒక వేదికపై బహిరంగంగా ప్రకటించారు. తాజాగా దీని గురించి రచయిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘చిరంజీవి నటించిన ‘మంచు పల్లకి’ సినిమాకు నేను డైలాగులు రాశాను. ఆ తర్వాత 40 ఏళ్లు మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉన్నాం. ఇక విభేదాలంటారా.. భార్యాభర్తల మధ్య కూడా వస్తుంటాయి. అలానే అందరి మధ్యా వస్తాయి. మళ్లీ కలిసిపోతూనే ఉంటారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అసలేం జరిగిందో కూడా మేమిద్దరం మర్చిపోయాం.  నాలుగేళ్ల తర్వాత చిరంజీవి ఎలా రిసీవ్‌ చేసుకుంటాడోనని భయపడ్డా. కానీ, ఆయన మాత్రం చాలా ప్రేమతో పలకరించారు. ఆయన కళ్లల్లో ఆప్యాయత కనిపించింది. మీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందని నేనే ఆయన్ని ఆరోజు వేదికపై అడిగాను. ఆ మాట అడగ్గానే ఆయన ఆశ్చర్యపోయారు. ‘నిజంగా రాస్తారా.. నువ్వు రాస్తే అంతకంటే కావాల్సిందేముంది. ఇప్పుడే ప్రకటించమంటావా’ అని చిరంజీవి అడిగారు. నేను ఓకే చెప్పడంతో ఆ స్టేజ్‌ పైనే ఈ విషయాన్ని వెల్లడించారు’ అని అన్నారు.

ఈ పుస్తకం రాయాలంటే చిరంజీవిని 50 సార్లు కలిసి మాట్లాడాలని యండమూరి చెప్పారు. చిరు జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సంఘటనలపై రాయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను కలవనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని