YVS Chowdary: తెరపైకి మరో ఎన్టీఆర్‌

కొత్తతరం నాయకా నాయికల్ని తెరకు పరిచయం చేయడంలో ముందుంటారు దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి. రామ్, సాయిదుర్గాతేజ్, ఇలియానా, అంకిత సహా పలువురు తారల్ని  ఆయనే పరిచయం చేశారు. ఈసారి నందమూరి కుటుంబానికి చెందిన నాలుగోతరం కథానాయకుడిని తెరపైకి తీసుకొస్తున్నారు.

Updated : 11 Jun 2024 06:41 IST

వై.వి.ఎస్‌.చౌదరి కొత్త చిత్రం ఖరారు
కథానాయకుడిగా నందమూరి హరికృష్ణ మనవడు 

కొత్తతరం నాయకా నాయికల్ని తెరకు పరిచయం చేయడంలో ముందుంటారు దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి. రామ్, సాయిదుర్గాతేజ్, ఇలియానా, అంకిత సహా పలువురు తారల్ని  ఆయనే పరిచయం చేశారు. ఈసారి నందమూరి కుటుంబానికి చెందిన నాలుగోతరం కథానాయకుడిని తెరపైకి తీసుకొస్తున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు.  నందమూరి జానకి రామ్‌ పెద్ద కుమారుడే నందమూరి తారక రామారావు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన కొత్త నిర్మాణ సంస్థ వివరాల్ని ప్రకటించడంతోపాటు, అందులో తీస్తున్న చిత్రంలోని కథానాయకుడి పేరుని పరిచయం చేశారు వై.వి.ఎస్‌.చౌదరి. న్యూ టాలెంట్‌ రోర్స్‌ (ఎన్‌.టి.ఆర్‌) పేరుతో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థపై తన అర్ధాంగి యలమంచిలి గీత నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

విలేకర్ల సమావేశంలో వై.వి.ఎస్‌.చౌదరి మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌  దివ్యమోహన రూపమే నన్ను సినిమా రంగంవైపు నడిపించింది. ఆయన సిద్ధాంతాల్ని నమ్మిన అభిమానులు ఇప్పుడు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల్లోనే పెట్టుబడి పెట్టిన తాను, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి  ఎంతోమంది కొత్తతరాన్ని తెరకు పరిచయం చేశా. కొత్తవాళ్లతో సినిమాలు  తీయడం కానీ, ఆదరించడం కానీ జరగని ఆ సమయంలోనే నాపై నమ్మకంతో తొలి అవకాశాన్నిచ్చారు అక్కినేని నాగార్జున. అందుకు ఆయనకి  రుణపడి ఉంటా. అప్పట్నుంచి కొత్తతరం తారలకి కేరాఫ్‌గా మారిపోయా. తదుపరి ఎవరితో సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు నిర్మాత టి. ప్రసన్నకుమార్‌ నందమూరి నాలుగోతరం కథానాయకుడిని చూపించారు. ఆ కథానాయకుడే నాకెంతో ఇష్టమైన నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్, దీపిక దంపతుల తనయుడు నందమూరి తారక రామారావు. నందమూరి కుటుంబానికి చెందిన నాలుగోతరం వారిని పరిచయం చేసే అవకాశం నాకు కలగడం మహాభాగ్యంగా భావిస్తున్నా. పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు అని పేరు పెట్టి, అంతటివాడు కావాలని తన తనయుడి గురించి ఏ కలలైతే కన్నారో అది సాకారమయ్యేలా అన్నీ కుదిరాయి. మంచి రూపం ఉన్న ఆ కుర్రాడిని చూశాక...నందమూరి తారక రామారావు పేరుని కొన్నేళ్లపాటు కొనసాగించేందుకు దేవుడు, కాలం, ప్రకృతి శాసిస్తోందనే అభిప్రాయం కలిగింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున ఈ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో కథానాయికగా తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాం. త్వరలోనే ఆమెనీ పరిచయం చేస్తాం. సంగీతం, సాహిత్యాలకీ నా సినిమాలో పెద్ద పీట వేస్తుంటా’’ అన్నారు. ‘‘మా స్నేహితుల అండదండలతో ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించాం. కొత్తతరాన్ని ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తామ’’న్నారు నిర్మాత యలమంచిలి గీత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని